సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:03 AM
మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయిందా..? ఆరు నెలల్లో దీన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం రండి.
ఇంటర్నెట్ డెస్క్: సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్‌ల నుంచి రుణాలు పొందే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు తక్కువ సిబిల్ స్కోర్‌ను కారణంగా చూపి బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి కూడా నిరాకరిస్తాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు లేకపోలేదు. సరైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఈ స్కోర్ 6 నెలల్లోనే పెరుగుతుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
సకాలంలో చెల్లింపులు: సిబిల్ స్కోర్‌ను మెరుగుపరిచేందుకు మొట్టమొదటగా ప్రస్తుత లోన్ ఈఎమ్ఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. ప్రతి నెలా గడువు తేదీలోపు ఈ చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
క్రెడిట్ కార్డ్ వాడకం: మీకు ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే తక్కువ వాడడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు అయితే అందులో రూ.30 వేలు మాత్రమే వాడండి. దీన్నే క్రెడిట్ యుటిలైజేషన్ రూల్ అని అంటారు. ఈ నియమాన్ని పాటించడం ద్వారా స్కోర్‌ను పెంచుకోవచ్చు.
లోన్ల కోసం పదే పదే దరఖాస్తు చేయొద్దు: తక్కువ సమయంలో ఎక్కువ లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు బ్యాంక్‌లు భావిస్తాయి. అందుకే పదే పదే దరఖాస్తు చేయకూడదు.
లోపాలు సరిదిద్దుకోవాలి: క్రెడిట్ రిపోర్ట్‌లను క్రమంగా తనిఖీ చేయాలి. అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు తీర్చిన అప్పులను ఇంకా తీర్చనట్టు బ్యాంక్‌లు చూపిస్తాయి. అలాంటి సమయంలో ఫిర్యాదు చేయాలి.
ఈ వార్తలూ చదవండి
కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? ఉచితంగా మార్చుకోండిలా..!
రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!