Share News

భారత్ చేతిలో ఓటమి.. కివీస్ కెప్టెన్ శాంటర్న్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 07:02 AM

సొంతగడ్డపై టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో కివీస్ ఓటమిపాలైంది.

భారత్ చేతిలో ఓటమి.. కివీస్ కెప్టెన్ శాంటర్న్ కీలక వ్యాఖ్యలు
Mitchell Santner

స్పోర్ట్స్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో కివీస్ జట్టు పరాజయం పాలైంది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, న్యూజిలాండ్ బౌలర్లు దానిని కాపాడలేకపోయారు. దీంతో సొంతగడ్డపై ప్రారంభమైన ఈ సిరీస్‌లో 1-0 తేడాతో న్యూజిలాండ్ వెనుకబడి ఉంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించాడు. జట్టు ప్రదర్శనతో పాటు తన గాయంపై కీలక సమాచారం ఇచ్చాడు.


'మేము ఓడిపోయినప్పటికీ మా ప్రదర్శన బాగానే ఉంది. మా ప్లేయర్లు చివరి వరకు పోరాడారు. ముఖ్యంగా మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. మా ఓపెనర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ సూపర్ నాక్ ఆడాడు. అతడు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు' అని శాంట్నర్ పేర్కొన్నాడు.


'ప్రత్యర్థి జట్టులో స్టార్ ఓపెనర్లు ఉన్నారు. వారి సత్తా ఏంటో మాకు తెలుసు. ఎప్పటిలానే వారు మరోసారి అసాధారణ ప్రదర్శన కనబరిచారు. దూకుడుగా ఆడుతూ మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. బౌలింగ్‌లో మేము మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ప్రారంభంలో తడబడినప్పటికీ మిడిల్ ఓవర్లలో మేము పుంజుకున్నాము. అందుకే మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో మేము కొన్ని క్యాచ్‌లను జారవిడిచాం. ఆ క్యాచ్‌లు అందుకుని ఉండింటే ఫలితం మరోలా ఉండేది. మా ఓటమికి ఇదే ఒక కారణమేమో. లేకుంటే మ్యాచ్ గెలిచే వాళ్లం. ఫ్లడ్ లైట్ల వెలుగులో క్యాచ్‌లు అందుకోవడం అంత సులభం కాదు. మా తదుపరి మ్యాచ్‌ల్లో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాం' అని శాంట్నర్ పేర్కొన్నాడు. మ్యాచ్ సమయంలో తనకు అయిన గాయంపై కూడా శాంట్నర్ స్పందించాడు. ఫీల్డింగ్ చేసేటప్పుడు మెడకు కాస్త దెబ్బ తగిలిందని, ప్రస్తుతం పర్వాలేదని, అంతా బాగానే ఉందని తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

నవంబరు మొదట్లో ‘ఇండీ’ మలి నిరసనలు

మిమ్మల్ని ప్రశ్నిస్తే.. విదేశీ ఏజెంట్‌ అంటారా: అన్నామలై

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు: నేహా బోరా

Updated Date - Oct 23 , 2026 | 07:13 AM