ఎప్‌స్టీన్- హర్దీప్‌సింగ్ ఫొటోల కలకలం హర్దీప్ సింగ్
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:12 AM
బాలికల మీద లైంగికదాడులకు పాల్పడిన నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురీ కలిసి ఉన్న ఫొటోలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా న్యాయవిభాగం విడుదల చేసిన రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రుబియో భారత పర్యటనకు ముందు విడుదల చేసిన అమెరికా
ఏ దేశద్రోహిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఫొటోను విడుదల చేశారు: రాహుల్
న్యూఢిల్లీ, అక్టోబరు 22: బాలికల మీద లైంగికదాడులకు పాల్పడిన నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురీ కలిసి ఉన్న ఫొటోలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా న్యాయవిభాగం విడుదల చేసిన రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ గదిలో ఎప్‌స్టీన్, హర్దీప్ సింగ్‌పురీ ఒక టేబుల్ వద్ద కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ఎప్‌స్టీన్‌తో భేటీపై హర్దీప్ సింగ్ గతంలో స్పందిస్తూ.. తాను అధికారిక సమావేశాల్లో భాగంగానే తన బృందంతో కలిసి ఆయనను కలిశానని తెలిపారు. అయితే, తాజాగా విడుదలైన ఫొటోల్లో మాత్రం ఎప్‌స్టీన్, హర్దీప్ సింగ్ తప్ప ఎవరూ లేరు. మసక వెలుతురు లైట్లతో కూడిన గదిలో వీరు సమావేశం కావటం ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అదే గదిలో ఎప్‌స్టీన్ పలువురు బాలికలతో అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు గతంలో విడుదలయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ పాత ఫొటోలను, కొత్తగా హర్దీప్ సింగ్ తో భేటీ అయిన ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు విడుదలైన సందర్భం కూడా చర్చనీయాంశమవుతోంది. అమెరికా విదేశాంగమంత్రి రుబియో భారత పర్యటనకు వచ్చి..ముఖేశ్ అంబానీతో సమావేశమైన నేపథ్యంలో ఈ ఫొటోలను అమెరికా విడుదల చేయటం గమనార్హం. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘రుబియో ముంబైకి వెళ్తారు.
అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్, పురీల ఫొటోలను విడుదల చేస్తుంది. ప్రియమైన బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలారా! ఏ దేశద్రోహిని వాళ్లు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు?’ అంటూ నర్మగర్భంగా ఓ ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మంత్రి హర్దీప్ సింగ్ ను ఉద్దేశించి.. ‘ఈ గదిని గుర్తుపట్టావా? ఎప్‌స్టీన్‌తో ఎన్నడూ ముఖాముఖి సమావేశాలు జరగలేదని చెప్పావు కదా? నీ ‘డిజిటల్ ఇండియా’ సమావేశాలు ఈ ప్రైవేటు బెడ్‌రూంలో జరిగాయా?’ అని పేర్కొన్నారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్‌రౌత్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎవరి కోసం ఎప్‌స్టీన్‌ను హర్దీప్ కలిశారు. మోదీ సందేశాన్ని ఏమైనా తీసుకెళ్లారా’ అని అన్నారు. ఈ పరిణామంపై దీప్కే కూడా స్పందించారు. ‘ఎప్‌స్టీన్‌తో ఎన్నడూ వ్యక్తిగతంగా కలవలేదని పురీ చెప్పారు కదా!’ అని పేర్కొన్నారు.
పదేళ్లనాటి సంగతి.. గుర్తు లేదు: హర్దీప్
ఈ ఫొటోలపై న్యూస్ వెబ్‌సైట్ ‘ది వైర్’.. హర్దీప్ సింగ్‌పురీ కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు.. ఆ ఫొటోలు పదేళ్ల కిందటివని, ఏ సమావేశంలో ఆ ఫొటోలు తీశారో మంత్రికి గుర్తు లేదని పేర్కొనటం విశేషం. ‘ఆయా సమావేశాల్లో ఇతరులు పాల్గొన్నారా? వారు రావటానికి ముందు లేదా వారు వెళ్లిపోయిన తర్వాత ఆ ఫొటోలు తీశారా అన్నది కూడా తెలియదు’ అని పేర్కొంది. అధికారిక విధుల్లో భాగంగానే ఎప్‌స్టీన్‌తో పురీ కలిశారని, ఒంటరిగా ఎప్‌స్టీన్‌ను కలవలేదని పురీ ఎన్నడూ చెప్పలేదని తెలిపింది.