Share News

అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:11 PM

నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. వైభవ్‌ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు.

అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య
Hardik Pandya Sportsmanship

స్పోర్ట్స్ డెస్క్: ఆటల్లో గెలుపోటములు సహజం. అయితే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే ఆటగాళ్లు నిజమైన విజేతలుగా నిలుస్తుంటారు. అలానే చాలా సందర్భాల్లో కొందరు క్రీడాకారులు తమదైన చర్యలతో అభిమానుల మనసు గెలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. 'ఇది కదా క్రీడా స్ఫూర్తి' అంటూ అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ హార్దిక్ పాండ్య ఏం చేశాడు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...


ఐపీఎల్‌-2026లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్లలపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌.. ముంబై స్టార్‌ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది.


ఈ మ్యాచ్‌లో ముంబైపై 27 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలిచి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. రాజస్థాన్ చేతిలో ముంబై పరాజయం పాలైనప్పటికీ.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శించిన అసాధారణ బ్యాటింగ్‌కు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిదా అయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు. అతడి భుజం తడుతూ.. గుండెపై చేయి వేసి.. ‘ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా’ అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


హార్దిక్ పాండ్య మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు. 'ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆడిన ఆట తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజస్థాన్‌తో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నప్పుడే వైభవ్ గురించి మా జట్టులో చర్చించుకున్నాం. వైభవ్ ఆడే విధానం, అతనిలోని ఆత్మవిశ్వాసం అద్భుతం. వైభవ్ భవిష్యత్తు మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను' అని పాండ్య తెలిపాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ.. ఓ యువ ఆటగాడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్దిక్ తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం

Updated Date - Apr 08 , 2026 | 12:48 PM