కేరళం ఎన్నికలు.. 2011 ఫలితాలు రిపీట్ అవుతాయా?
ABN , Publish Date - Apr 08 , 2026 | 07:14 AM
కేరళంలో 140 సీట్లు ఉండగా.. గత ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 99 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 41 స్థానాల్లో గెలిచింది.
తిరువనంతపురం, ఏప్రిల్ 8: కేరళంలో రేపు (గురువారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు నిర్వహించాయి. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా గెలుపు తమదే అంటోంది. కేరళంలో 140 సీట్లు ఉండగా.. గత ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 99 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 41 స్థానాల్లో గెలిచింది.
కాంగ్రెస్ ధీమా.. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి..
2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 72 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి ఉమెన్ చాందీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, 2016 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ పడింది. కేరళ కాంగ్రెస్ (ఎమ్) యూడీఎఫ్‌ను వీడి ఎల్‌డీఎఫ్‌లో చేరింది. దీంతో ఓ వర్గం ఓటు బ్యాంకును ఎల్‌డీఎఫ్ సొంతం చేసుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ 21 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ప్రధాన ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోక తప్పలేదు. ఈసారి ఫలితాలపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. తమ కూటమి భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకోవటం ఖాయమని అంటోంది.
సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఎల్‌డీఎఫ్
కేరళంలో సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది (Anti-incumbency). కానీ, 2021లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. గత 40 ఏళ్ల రికార్డును తిరగరాసింది. ఎల్‌డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎమ్) సింగిల్‌గా 62 సీట్లను గెలుచుకుంది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఈ సారి కూడా అధికారం తమదేనని ఎల్‌డీఎఫ్ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. మరోసారి చరిత్ర సృష్టిస్తామంటోంది.
బీజేపీ ఆశలు.. ఈ సారైనా..
2016 ఎన్నికల్లో బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. నెమోన్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థి వి. శివన్‌కుట్టి మీద బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్ విజయం సాధించారు. అది కూడా 8,671 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేరళ రాజకీయాల్లో బీజేపీ చరిత్ర సృష్టిస్తూ మొట్ట మొదటి సారిగా గెలుపొందింది. అది కూడా ఈ ఒక్కస్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. అయితే, గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ దారుణ ఓటమి పాలైంది. ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ సారి కేరళ రాజకీయాల్లో తమ ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం
యుద్ధం వల్ల 10వేలకు పైగా విమానాల రద్దు