Share News

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

ABN , Publish Date - Apr 08 , 2026 | 10:20 AM

ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు
Yashasvi Jaiswal IPL Highest Scores

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితకబాదాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అతడు కేవలం 32 బంతుల్లోనే 10 మెరుపు బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు.


కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లోని పలు రికార్డులను బద్దలు కొట్టాడు. యశస్వి జైస్వాల్‌ ఐపీఎల్ కెరీర్‌లో ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ముంబైతో మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ గతంలో 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో 19 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.


అలానే రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ స్థానం సంపాదించాడు. 19 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన జైస్వాల్.. అజింక్యా రహానేతో​ కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 సార్లు 50+ స్కోర్లతో బట్లర్‌, సంజు శాంసన్‌లు సంయుక్తంగా టాప్ ప్లేసులో ఉన్నారు. అలానే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన నాల్గో క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 69 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. వంద సిక్సర్ల విషయంలో జైస్వాల్.. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా అధిగమించాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన భారత్ ప్లేయర్లు

  • 59 - శివం దూబే

  • 62 - రిషబ్ పంత్

  • 68 - కేఎల్ రాహుల్

  • 69 - యశస్వి జైస్వాల్*

  • 74 - అభిషేక్ శర్మ


కాగా ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ జైస్వాల్ ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అతడి కంటే ముందు షేన్ వాట్సన్ (109), బట్లర్ (135), శాంసన్ (192) ఉన్నారు.

ఐపీఎల్‌లో జైస్వాల్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:

  • 124 vs ముంబై ఇండియన్స్, ముంబై, వాంఖడే, 2023

  • 104* vs ముంబై ఇండియన్స్, జైపూర్, 2024

  • 98* vs కేకేఆర్, కోల్‌కతా, 2023

  • 77* vs ముంబై ఇండియన్స్, గౌహతి, 2026, ఈ రాత్రి*

  • 77 vs సీఎస్కే, జైపూర్, 2023

  • 75 vs ఆర్సీబీ, జైపూర్, 2025


ఇవి కూడా చదవండి:

టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం

రాజస్థాన్‌ హ్యాట్రిక్‌

Updated Date - Apr 08 , 2026 | 12:00 PM