టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Apr 08 , 2026 | 07:54 AM
భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టనున్నారు. ఈమేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న భారీ వేడుక నిర్వహించి.. రవిశాస్త్రి పేరిట స్టాండ్‌ను ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా రవిశాస్త్రి స్టాండ్ అధికారికంగా ప్రారంభం కానుంది. అదే రోజు రవిశాస్త్రితో పాటు మరికొందరు దిగ్గజాలను కూడా ఎంసీఏ సత్కరించనుంది. మహిళా టీమిండియా మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ పేరును వాంఖడే స్టేడియం గేట్‌కు పెట్టనున్నారు. అదేవిధంగా దివంగత దిగ్గజ బ్యాటర్ దిలీప్ సర్దేశాయ్ పేరును కూడా వాంఖడేలోని ఇంకొక గేట్‌కు పెట్టాలని ఎంసీఎ నిర్ణయించింది.
రవిశాస్త్రి భారత క్రికెట్‌కు నాలుగు దశాబ్దాలు సేవలను అందించాడు. ఆటగాడిగా, కోచ్‌గా టీమిండియా విజయాల్లో భాగమయ్యాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా శాస్త్రి ఉన్నాడు. ఆయన 2017 నుంచి 2021 మధ్య భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా రవిశాస్త్రి నిలిచాడు. తన కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి దాదాపు 7,000 పరుగులు, 280 వికెట్లు తీశాడు. అలానే రవి శాస్త్రి చాలా ఏళ్ల నుంచి బీసీసీఐకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి: