Share News

గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్.. తిరిగి జట్టులో చేరనున్న శుభ్‌మన్ గిల్

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:25 PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఊరటినిచ్చే వార్త వచ్చింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్.. తిరిగి జట్టులో చేరనున్న శుభ్‌మన్ గిల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఊరటినిచ్చే వార్త వచ్చింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరగనున్న కీలక పోరుకు గిల్ అందుబాటులో ఉంటాడని గుజరాత్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ వెల్లడించాడు. శుభ్‌మన్ ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు.


మెడ కండరాల గాయంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు గిల్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో జట్టును వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ నడిపించాడు. అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు గట్టి పోటీనిచ్చిన జీటీ.. చివరి మెట్టు బోల్తా పడింది. కేవలం 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఓడింది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆర్ఆర్‌పై గిల్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కుమార్ కుషాగ్రా(18) తీవ్రంగా నిరాశపర్చాడు. సాయి సుదర్శన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్ రీ ఎంట్రీ జట్టుకు కీలకం కానుంది.


ఇదిలా ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ గిల్ ఆడటంపై స్పందించాడు. ‘గుజరాత్ టైటాన్స్‌కు గిల్ బలం. అలాంటి ఆటగాడు జట్టులో లేకపోతే ప్రత్యర్థి బౌలర్లకు కొంత ఊరట ఉంటుంది. కానీ గిల్ ఒక్కసారి ఫామ్ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పేసుకునే సత్తా అతడిలో ఉంది’ అని అన్నాడు. మొత్తంగా కీలక సమయంలో కెప్టెన్ గిల్ తిరిగి జట్టులో చేరడం గుజరాత్‌కు పెద్ద బూస్ట్‌ అప్‌గా మారింది. ఢిల్లీలో జరిగే ఈ పోరులో గిల్ నాయకత్వం జట్టును విజయపథంలోకి తీసుకువస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 07 , 2026 | 09:31 PM