Share News

బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్

ABN , Publish Date - Apr 07 , 2026 | 07:22 PM

బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు ఆ హోదాలో ఉన్న అమినుల్ ఇస్లాం బుల్‌బుల్‌ను జాతీయ క్రీడా మండలి ఆ పదవి నుంచి తప్పించింది.

బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్
Tamim Iqbal

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు ఆ హోదాలో ఉన్న అమినుల్ ఇస్లాం బుల్‌బుల్‌ను జాతీయ క్రీడా మండలి ఆ పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం బోర్డు వ్యవహారాలను నిర్వహించేందుకు తాత్కాలిక(అడ్‌హక్) కమిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐతో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా బీసీబీ ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2026లో తాము భారత్‌లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డు మొండి వైఖరి ప్రదర్శించింది. ఆ సమయంలో జరిగిన వివాదమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అప్పటి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. బంగ్లా జట్టు భారత్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం, మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఒత్తిడి చేశాడు. అలాంటి సమయంలో బోర్డు అధ్యక్షుడిగా బుల్‌బుల్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదాల కారణంగా బీసీబీ డైరెక్టర్లలో ఆరుగురు రాజీనామా చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీంతో జాతీయ క్రీడా మండలి బోర్డును రద్దు చేసి కొత్త కమిటీని నియమించింది.


తమీమ్ అరుదైన రికార్డు

ఈ కొత్త అడ్‌హాక్ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను నియమించారు. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించే బాధ్యత అప్పగించారు. 39 ఏళ్ల తమీమ్ బంగ్లా క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇదిలా ఉండగా ఐసీసీకి ఈ నిర్ణయం గురించి తెలియజేశారు. మొత్తంగా బంగ్లాదేశ్ క్రికెట్‌లో అంతర్గత కల్లోలం మరోసారి బయటపడింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో జట్టు ప్రదర్శనపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.


ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 07 , 2026 | 07:22 PM