రాజస్థాన్ హ్యాట్రిక్
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:30 AM
ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. మంగళవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై...
నేటి మ్యాచ్
ఢిల్లీ X గుజరాత్
వేదిక ఢిల్లీ రా.7.30 నుంచి
జైస్వాల్, వైభవ్ మెరుపు ఇన్నింగ్స్
ముంబైపై ఘన విజయం
గువాహటి: ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. మంగళవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై విరుచుకుపడింది. దీంతో 27 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేన ఘన విజయాన్ని సాధించింది. వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన రాయల్స్.. ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఎగబాకింది. అంతకుముందు వర్షం కారణంగా రాత్రి 10.10 గంటలకు ఆరంభమైన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ముందుగా రాజస్థాన్ 11 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 39) అదరగొట్టారు. స్పిన్నర్ ఘజన్‌ఫర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25), నమన్ ధిర్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 25) రాణించారు. బర్గర్, సందీప్, రవి బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జైస్వాల్ నిలిచాడు.
పోరాటమే లేకుండా..: సవాల్‌తో కూడిన ఛేదనలో ముంబై బ్యాటర్లు ఆరంభం నుంచే తడబడ్డారు. తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్ రికెల్టన్ (8), సూర్యకుమార్ (6), రోహిత్ శర్మ (5) పెవిలియన్‌కు చేరారు. అప్పటికి స్కోరు 22 మాత్రమే. ఇక ఐదో ఓవర్‌లో స్పిన్నర్ బిష్ణోయ్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. కెప్టెన్ హార్దిక్ (9), తిలక్ (14)లను అవుట్ చేయడంతో ముంబై 46/5 స్కోరుతో ఓటమి దిశగా సాగింది. అయితే నమన్, రూఽథర్‌ఫోర్డ్ జోడీ కాసేపు పోరాడింది. ఆరో ఓవర్‌లో నమన్ 6,4తో 14 రన్స్... తర్వాతి ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్ రెండు ఫోర్లతో 15 రన్స్ రాబట్టారు. ఇక తుషార్ ఓవర్‌లోనూ రూథర్‌ఫోర్డ్ రెండు సిక్సర్లతో కాస్త ఆశలు రేపాడు. కానీ అదే ఓవర్‌లో స్లో బాల్‌కు క్యాచ్ అవుటయ్యాడు. అయితే ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 17 బంతుల్లోనే 47 పరుగులు జత చేర్చారు. ఆ వెంటనే నమన్‌ను పేసర్ బర్గర్ అవుట్ చేయడంతో ముంబై పరాజయం ఖాయమైంది.
తొలి బంతి నుంచే బాదుడు: కొన్ని గంటల పాటు పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడంతో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ పరుగుల వర్షం కురిపించారు. పవర్‌ప్లే 3.2 ఓవర్లే కావడంతో.. అయితే సిక్స్ లేదంటే ఫోర్ అన్నట్టుగా ఈ జోడీ విధ్వంసం సాగింది. పేసర్ దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే జైస్వాల్ 4,6,4,4,4తో 22 పరుగులు రాబట్టాడు. ఇక వైభవ్ రెండు సిక్సర్లతో పేసర్ బుమ్రాకు స్వాగతం పలికాడు. బౌల్ట్ సైతం 22 పరుగులు సమర్పించుకోగా.. రాజస్థాన్ కేవలం 16 బంతుల్లోనే 50 రన్స్ పూర్తి చేసింది. ఈ దశలో హార్దిక్ నాలుగో ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చి కాస్త కట్టడి చేశాడు. ఇక శార్దూల్ ఓవర్‌లో 6,4,6 బాదిన వైభవ్ అదే ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 30 బంతుల్లో 80 పరుగుల తుఫాన్ భాగస్వామ్యం ముగిసింది. జురెల్ (2) విఫలం కాగా.. ఉన్నకాసేపు కెప్టెన్ పరాగ్ (20) రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో వేగం చూపాడు. అటు జైస్వాల్ 23 బంతుల్లోనే వరుసగా రెండో ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఆఖరిదైన 11వ ఓవర్‌లో జైస్వాల్ మూడు ఫోర్లతో 18 రన్స్ రాబట్టగా స్కోరు 150కి చేరింది.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (నాటౌట్) 77, వైభవ్ (సి) తిలక్ (బి) శార్దూల్ 39, జురెల్ (ఎల్బీ) ఘజన్‌ఫర్ 2, పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్‌ఫర్ 20, హెట్‌మయెర్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 11 ఓవర్లలో 150/3; వికెట్ల పతనం: 1-80, 2-84, 3-121; బౌలింగ్: దీపక్ చాహర్ 1-0-22-0, బుమ్రా 3-0-32-0, బౌల్ట్ 1-0-22-0, హార్దిక్ 2-0-17-0, శార్దూల్ 2-0-36-1, ఘజన్‌ఫర్ 2-0-21-2.
ముంబై: రికెల్టన్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 8, రోహిత్ (ఎల్బీ) సందీప్ 5, సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6, తిలక్ (సి) హెట్‌మయెర్ (బి) బిష్ణోయ్ 14, హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9, నమన్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25, రూథర్‌ఫోర్డ్ (సి) సందీప్ (బి) తుషార్ 25, శార్దూల్ (సి) జురెల్ (బి) సందీప్ 8, చాహర్ (నాటౌట్) 6, బౌల్ట్ (రనౌట్) 1, బుమ్రా (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 11 ఓవర్లలో 123/9; వికెట్ల పతనం: 1-10, 2-20, 3-22, 4-41, 5-46, 6-93, 7-103, 8-111, 9-116, బౌలింగ్: ఆర్చర్ 2-0-17-1, బర్గర్ 2-0-21-2, సందీప్ 3-0-26-2, తుషార్ దేశ్‌పాండే 2-0-29-1, రవి బిష్ణోయ్ 2-0-25-2.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 3 3 0 0 6 2.403
పంజాబ్ 3 2 0 1 5 0.637
బెంగళూరు 2 2 0 0 4 2.501
ఢిల్లీ 2 2 0 0 4 1.170
హైదరాబాద్ 3 1 2 0 2 0.275
లఖ్‌నవూ 2 1 1 0 2 -0.542
ముంబై 3 1 2 0 2 -0.715
కోల్‌కతా 3 0 2 1 1 -1.964
గుజరాత్ 2 0 2 0 0 -0.424
చెన్నై 3 0 3 0 0 -2.517
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్