Share News

హర్మన్ ప్రీత్ కౌర్ బాటలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:22 PM

శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ ధనంజయ డి సిల్వ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాయకత్వ బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకొంటున్నట్లు ఇవాళ ప్రకటించాడు.

హర్మన్ ప్రీత్ కౌర్ బాటలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ
Dhananjaya de Silva

స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన పదవికి రాజీనామా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అకస్మాత్తుగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో క్రీడ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. తాజాగా పురుషుల విభాగంలో శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ ధనంజయ డి సిల్వ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాయకత్వ బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకొంటున్నట్లు ఇవాళ (గురువారం) ప్రకటించాడు.


శ్రీలంక సెలక్షన్‌ కమిటీకి ధనంజయ్ రాసిన లేఖలో పలు అంశాలను పేర్కొన్నాడు. కొత్త తరానికి కెప్టెన్సీ బాధ్యతలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా తీసుకున్నానని ధనంజయ డి సిల్వ వెల్లడించాడు. నాయకుడిగా వైదొలిగినప్పటికీ ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. ధనంజయ డి సిల్వ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు స్వాగతించింది. లంక క్రికెట్‌ సీఈఓ ఆష్లే డి సిల్వ మాట్లాడుతూ.. ‘డి సిల్వ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం. మా టెస్టు జట్టుకు నాయకుడిగా సేవలు అందించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.


1991లో కొలంబోలో జన్మించిన డి సిల్వ 2015లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 69 టెస్టులు, 93 వన్డేలు, 48 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ధనంజయ టెస్టుల్లో 4431, వన్డేల్లో 1924, టీ20లలలో 890 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టెస్టులో 43, వన్డేల్లో 48, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌. డి సిల్వ 2024 జనవరిలో దిముత్‌ కరుణరత్నె నుంచి శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మొత్తంగా 18 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించి.. ఏడు టెస్టుల్లో జట్టును గెలిపించాడు. కెప్టెన్‌గా 1130 పరుగులు సాధించడంతో పాటు.. 44.44 బౌలింగ్ సగటుతో 9 వికెట్లు సాధించాడు. కాగా చివరిగా.. టీమిండియాతో ఈ ఏడాది జూలై- ఆగష్టులో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా ధనంజయ డి సిల్వ లంక కెప్టెన్‌గా వ్యవహరించాడు.


ఇవి కూడా చదవండి:

ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం.. జడేజా పోస్ట్ వైరల్

మెస్సికి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు.. ‘ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతం’

భువిపై ఎవరూ దయ చూపలేదు.. అది అతడి అర్హత: వసీం జాఫర్

Updated Date - Oct 08 , 2026 | 01:22 PM