భువిపై ఎవరూ దయ చూపలేదు.. అది అతడి అర్హత: వసీం జాఫర్
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:54 AM
న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికైన సంగతి తెలిసిందే. భువి పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ హర్షం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్‌తో అక్టోబరు 22 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికైన సంగతి తెలిసిందే. 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత భారత పేస్ విభాగంలో అనుభవలేమిని అధిగమించేందుకే సెలెక్టర్లు భువీ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. భువనేశ్వర్ పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ హర్షం వ్యక్తం చేశాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో వసీం జాఫర్ మాట్లాడుతూ... 'భువీకి దక్కిన ఈ అవకాశం ఎవరి దయాదాక్షిణ్యం కాదు. అతను దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో సాధించిన చక్కటి ప్రదర్శనలు, ఫిట్‌నెస్‌కు దక్కిన ప్రతిఫలం. భువీ ఎప్పుడో టీమిండియాలోకి రావాల్సి ఉంది. కానీ ఇంతకాలం అతడిని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాలేదు' అని వసీం వ్యాఖ్యానించాడు. యువ రక్తాన్ని ప్రోత్సహించడం మంచిదే అయినా, ఒత్తిడితో కూడిన పెద్ద టోర్నీలలో గెలవాలంటే అనుభవం తప్పనిసరి అని జాఫర్ స్పష్టం చేశాడు.
అదే సమయంలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌ల గురించి కూడా జాఫర్ ప్రస్తావించాడు. వారిద్దరినీ క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడించకపోవడంపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీశ్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లను పరీక్షిస్తున్నప్పటికీ, మేనేజ్‌మెంట్‌కు ఇంకా పూర్తి నమ్మకం కుదరలేదనిపిస్తోందన్నాడు. ఇందుకే సీనియర్లవైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారని జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2027 ప్రపంచకప్ ముంగిట బుమ్రా, షమీ, సిరాజ్‌లతో కూడిన పేస్ త్రయాన్నే ప్రధాన ఎంపికగా చూడాలని సూచించాడు. మొత్తంగా భువీ తనను ఫిట్‌నెస్ నిరూపించుకుంటే జస్ప్రీత్ బుమ్రాతో కలిసి మెగా టోర్నీలో భారత్ తరఫున కీలక పేస్ ద్వయంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
హస్తినాపురంలో నిలిపి ఉన్న కారు దగ్ధం.. కేసు నమోదు
విజయవాడలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసుల పంజా.. పలువురి అరెస్ట్