Share News

అప్పుడు దూకుడు.. ఇక నిలకడ!

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:49 AM

దశాబ్దంపాటు భారత మహిళల క్రికెట్‌ జట్టును నడిపించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగ్గా.. నూతన కెప్టెన్‌గా డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన పగ్గాలందుకొంది. హర్మన్‌తో పోల్చితే...

అప్పుడు దూకుడు.. ఇక నిలకడ!

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

దశాబ్దంపాటు భారత మహిళల క్రికెట్‌ జట్టును నడిపించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగ్గా.. నూతన కెప్టెన్‌గా డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన పగ్గాలందుకొంది. హర్మన్‌తో పోల్చితే మంధాన వ్యవహారశైలి భిన్నం. దూకుడైన తత్వంతో ఉండే కౌర్‌.. మైదానంలో ఎప్పుడూ భావోద్వేగాలను నియంత్రించుకోలేదు. రికార్డులు బద్దలుకొట్టిన ఇన్నింగ్స్‌లో, సంబరాల్లో, ఓటముల్లో, అంపైర్లు, ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు హర్మన్‌ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో ఎదుగుతున్న భారత జట్టుకు కౌర్‌ లాంటి దుందుడుకు శైలి ఎంతో అవసరం. కానీ, ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లను సవాల్‌ చేసే స్థాయికి ఎదిగింది. ఇలాంటి తరుణంలో మంధాన శైలి ఇప్పుడు భారత్‌కు అవసరం. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా హర్మన్‌ ఎంతో దూకుడుగా వ్యవహరించినా.. ఎంతో సరదాగా, ప్రశాంతంగా ఉండేదని మాజీ కోచ్‌ రామన్‌ చెప్పాడు.

ఎంత ఎదిగినా.. ఒదిగే: మరోవైపు భిన్న మనస్తత్వాలైన కెప్టెన్లు మిథాలీ రాజ్‌, హర్మన్‌ హయాంలో స్మృతి ఆడింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో విదేశీ స్టార్లు సోఫీ డివైన్‌, హీథర్‌ నైట్‌ లాంటి వారితో మంధాన జట్టును నడిపించింది. ఎన్నో ఏళ్లుగా బిగ్‌బాష్‌, హండ్రెడ్‌, డబ్ల్యూపీఎల్‌ టోర్నీలలో ఆడడంతో.. ఎంతో మంది కోచ్‌లు, నాయకులతోపాటు విభిన్న సంస్కృతులను ఆకళింపు చేసుకొంది. ఇక, డబ్ల్యూపీఎల్‌లో బెంగళూరుకు తొలి టైటిల్‌ అందించినప్పుడు మంధానలోని అసలు సిసలు సారథ్యం కనిపించింది. ఏమాత్రం అంచనా లేని జట్టుగా బరిలోకి దిగిన బెంగళూరు రెండు టైటిళ్లను కొల్లగొట్టిందంటే అది మంధాన ప్రతిభే. జట్టు ఎంపిక, నిర్ణయాల్లో ఆమె తనదైన ముద్రవేసింది. ముఖ్యంగా జట్టు సభ్యులు అరుంధతి, శ్రేయాంక పాటిల్‌, రాధా యాదవ్‌, పూజా వస్త్రాకర్‌లతో బలమైన సంబంధాలను నెలకొల్పింది. దీంతో టీమ్‌లో మంధానపై ఎంతో నమ్మకం పెరిగింది. నేటి తరానికి తగ్గట్టుగా వారితో రీల్స్‌ చేస్తూ సరదాగా, వ్యక్తిగతంగా కూడా చక్కని బంధాన్ని ఏర్పర్చుకొంది. అంతేకాకుండా జట్టు వైఫల్యానికి తానే ముందుగా బాధ్యత తీసుకొని.. మంధాన సహచరుల మనసులు గెలుచుకొంది. తాను ఎన్ని పరుగులు చేసినా, రికార్డులు బద్దలుకొట్టినా.. ఒదిగే ఉంది. అయితే, హర్మన్‌ తరహాలో బహిరంగంగా తన భావోద్వేగాలను మాత్రం ప్రదర్శించలేదు. కౌర్‌ జట్టుకు పోరాట స్ఫూర్తి నేర్పితే.. ఆ పంథానే కొనసాగిస్తూ నిలకడగా విజయాలు సాధించేలా చేయడమే మంధాన ముందున్న కర్తవ్యం.


హర్మన్‌తో విభేదాలంటూ పుకార్లు

  • ప్రతిస్పందనగా స్మృతి ఇన్‌స్టా పోస్ట్‌

మామూలుగా పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌ జట్టులో నాయకత్వ మార్పు లాంటి విషయాలపై బయట పెద్దగా చర్చ జరగదు. కానీ, ఈసారి హర్మన్‌ వైదొలగడం.. స్మృతి మంధానకు జట్టు పగ్గాలు అప్పగించడంపై రెండ్రోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా స్మృతి, హర్మన్‌ మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. నాయకత్వ మార్పు గురించి బీసీసీఐ భేటీకి హాజరైనప్పుడు కూడా వీరిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడ లేదన్న పుకార్లు వ్యాపించాయి. అయితే, తమ మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని చెప్పేలా హర్మన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ స్మృతి మంధాన ఓ భావోద్వేగ పోస్ట్‌ చేసింది. ‘పదేళ్ల హర్మన్‌ కెప్టెన్సీ అద్భుతం. ఇన్నేళ్లు నీతో కలిసి ఆడడం గర్వంగా భావిస్తా. మరికొన్ని రోజులు కలిసి ప్రయాణిస్తూ.. దేశానికి మరిన్ని విజయాలు అందిద్దాం’ అని ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌లో స్మృతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 05:49 AM