రాహుల్ ద్రవిడ్ కుమారుడి విధ్వంసం.. 100 బంతుల్లో 151 పరుగులు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:47 PM
భారత అండర్ 19 వన్డే టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ జట్టుతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర సెంచరీ బాదాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత అండర్ 19 వన్డే టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ జట్టుతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర సెంచరీ బాదాడు. కేవలం 100 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపాడు. కాగా ఈ దేశీ వన్డే టోర్నీలో అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక జట్టు సారథి వ్యవహరిస్తున్నాడు.
ఇవాళ (శుక్రవారం) నాటి మ్యాచ్లో కర్ణాటక- గుజరాత్ అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 357 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఐదు, ఆరో స్థానాల్లో వచ్చిన సమీర్ భండారి 88 బంతుల్లో 119 పరుగులు, యశ్ పంజ్వాని 57 బంతుల్లో 106 పరుగులతో విధ్వంసకర అజేయ సెంచరీలు బాదారు.
అనంతరం 357 పరుగుల లక్ష్య చేధనకు కర్ణాటక దిగగా.. ఓపెనర్లు రోహిత్ రెడ్డి (26), నితీశ్ ఆర్య (6) విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ధ్రువ్ క్రిష్ణన్, కెప్టెన్ అన్వయ్ ద్రవిడ్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధ్రువ్ 100 బంతుల్లో 130 పరుగులు సాధించగా.. అన్వయ్ కూడా శతక్కొట్టాడు. కేవలం 100 బంతుల్లోనే 20 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అన్వయ్ 151 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో తేజస్ రెడ్డి 9 బంతుల్లో 21 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 45.3 ఓవర్లలో కర్ణాటక ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా.. వీజేడీ (విజయదేవన్ మెథడ్) పద్ధతి ప్రకారం.. కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్
వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్
ఢిల్లీలో నిరసనలతో రూ.2వేల కోట్ల వ్యాపార నష్టం? ప్రధాని మోదీకి వర్తక సంఘాల లేఖ