Share News

వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:04 PM

వెస్టిండీస్‌తో జరగనున్న ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్
Abhishek Nayar

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో నిర్ణయాత్మక ఐదో టీ20 శనివారం బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక్క అవకాశం కూడా రాలేదు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఈ 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం దక్కుతుందా? లేదా? అనే చర్చ సాగుతూనే ఉంది. ఈ విషయంపై టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.


‘వైభవ్ సూర్యవంశీ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బెంగళూరు వంటి పిచ్‌పై ఆ కుర్రాడు అదరగొడతాడు. అయితే వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఓపెనర్‌గానే బరిలోకి దించాలి. వేరే ఏ స్థానంలో ఆడించినా అది వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. అలా అని వన్ డౌన్ బ్యాటర్‌ను కూడా మార్చొద్దు. వైభవ్ ఆటను చూడాలని ఎంత ఆసక్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయకపోవడమే మంచిది. నేను మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే బౌలింగ్‌ విభాగంలోనే మార్పులు చేస్తాను’ అని నాయర్‌ స్పష్టం చేశాడు.


ప్రస్తుత సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ మిశ్రమ ఫలితాలు సాధిస్తున్నారు. అభిషేక్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 139 పరుగులు చేశాడు. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి సత్తా చాటాడు. మరోవైపు సంజు శాంసన్‌ 152 పరుగులతో రాణించాడు. రాంచీలో 41 బంతుల్లో 82 పరుగులు చేయగా.. హైదరాబాద్‌లో 23 బంతుల్లో 56 పరుగులతో మెరిశాడు. అయినప్పటికీ కొన్ని మ్యాచ్‌ల్లో వీరు తక్కువ స్కోర్లకే పరిమితం కావడంతో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో సిరీస్‌ విజేతను నిర్ణయించే కీలక పోరులో వైభవ్‌ బరిలోకి దిగుతాడా? లేక మరోసారి బెంచ్‌కే పరిమితమవుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

విండీస్‌తో ఐదో టీ20: అర్ష్‌దీప్‌ సింగ్‌కు గాయం.. భువీకి పిలుపు

మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్

Updated Date - Oct 16 , 2026 | 06:04 PM