Share News

'మమ్మల్ని తొక్కేస్తున్నారు'.. యూఎస్‌ తీరుపై ఇరాన్‌ కోచ్‌ ఘలానెయి తీవ్ర అసంతృప్తి

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:35 PM

అమెరికా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌ అమీర్‌ ఘలానెయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిఫా టోర్నీలో పాల్గొంటున్న తమ జట్టుపై అమెరికా ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలు, వీసా నిరాకరణలతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

'మమ్మల్ని తొక్కేస్తున్నారు'.. యూఎస్‌ తీరుపై ఇరాన్‌ కోచ్‌ ఘలానెయి తీవ్ర అసంతృప్తి
Iran football team USA restrictions

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌2026కు ఆతిథ్యమిస్తున్న అమెరికా.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌ అమీర్‌ ఘలానెయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఫిఫా టోర్నీలో పాల్గొంటున్న తమ జట్టుపై అమెరికా ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలు, వీసా నిరాకరణలతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు. బెల్జియంతో ఆదివారం రాత్రి జరగబోయే కీలక మ్యాచ్‌ కోసం లాస్ ఏంజిల్స్‌ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.


మ్యాచ్‌కు కనీసం 24 గంటల ముందు వేదికకు చేరుకోవాలని తాము భావించగా, అమెరికా అధికారులు కేవలం 16 గంటల సమయమే ఇచ్చారని అమీర్‌ ఘలానెయి తెలిపారు. అమెరికా నిర్ణయం వల్ల మెక్సికోలోని తమ బేస్ క్యాంప్‌‌లో సగం ప్రాక్టీస్‌ను వదిలేసి రావాల్సి వచ్చిందని వాపోయారు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే తిరిగి మెక్సికో వెళ్లాలనే నిబంధన ఆటగాళ్ల శారీరక, మానసిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇరాన్ మిడ్‌ఫీల్డర్ సయీద్ ఎజటోలాహి ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు, సపోర్టింగ్‌ స్టాఫ్‌, మీడియా ప్రతినిధులకు అమెరికా వీసాలు నిరాకరించిందని కోచ్‌ మండిపడ్డారు.


'మేము ఇక్కడికి ఫుట్‌బాల్‌ ఆడటానికి వచ్చాం, రాజకీయం చేయడానికి కాదు. మా దేశ అమరవీరుల కోసం మేము ఆడుతున్నాం. అమెరికా ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం' అని ఘలానెయి పేర్కొన్నారు. తోటి 47 దేశాల కోచ్‌లు ఈ వివక్షపై నోరు విప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను సడలించేందుకు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో చేస్తున్న ప్రయత్నాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గొడవలకు తాము అధికారికంగా ఫిఫాకు ఫిర్యాదు చేయకపోయినా, పబ్లిక్‌గా నిరసన తెలియజేస్తున్నామన్నారు. కాగా, ఇరాన్ ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల బెల్జియం ఆటగాడు థామస్ మునియర్ సానుభూతి వ్యక్తం చేశాడు. ఇలాంటి కఠిన పరిస్థితులు ఇరాన్ ఆటగాళ్లలో మరింత కసిని, దేశం కోసం గెలవాలనే పట్టుదలను పెంచుతాయని అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

ఇంగ్లండ్‌ పర్యటన.. భారత వన్డే జట్టు ఇదే

Updated Date - Jun 21 , 2026 | 05:43 PM