Share News

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:41 PM

బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌
Meenakshi Natarajan Denies Legal Cases, Alleges BJP and EC Role in Nomination Rejection

న్యూఢిల్లీ, జూన్ 21: తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ, ఎన్నికల సంఘం(EC) లాలూచీ పడి కుట్రపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించాయని ఆమె ధ్వజమెత్తారు. తనపై వస్తున్న ఆరోపణలను మీనాక్షి పూర్తిగా ఖండించారు. తన రాజ్యసభ సీటును అక్రమంగా చోరీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నాపై ఎలాంటి లీగల్‌ కేసులు లేవు

నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చానంటూ వస్తున్న వార్తలపై మీనాక్షి నటరాజన్ స్పష్టతనిచ్చారు. 'నాపై ఎలాంటి లీగల్ కేసులు లేవు. అసలు నామినేషన్ పత్రంలో 'లీగల్ నోటీస్'కు సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఎక్కడా లేదు. లేని కాలమ్‌ను సాకుగా చూపి, సాంకేతిక కారణాల పేరుతో నా నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం' అని ఆమె మండిపడ్డారు. కావాలనే బీజేపీ తనపై అబద్ధాలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.


కాంగ్రెస్ నేతల పాత్ర లేదు.. అంతా బీజేపీ కుట్రే!

ఈ నామినేషన్ తిరస్కరణ వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందంటూ వస్తున్న పుకార్లను ఆమె తోసిపుచ్చారు. 'నా నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర ఏమాత్రం లేదు. మా పార్టీ అంతా ఏకతాటిపైనే ఉంది. ఇదంతా పూర్తిగా బీజేపీ ఆడిన నాటకం. ప్రజాస్వామ్య వ్యవస్థలను వాడుకుని బీజేపీ చేస్తున్న కుట్రలను, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడమే నా ప్రస్తుత పోరాటం' అని మీనాక్షి స్పష్టం చేశారు.

ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని, విపక్ష నాయకులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆమె ఆరోపించారు. చట్టబద్ధంగా దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని కుతంత్రాలతో లాక్కున్నారని, ఈ అన్యాయంపై వెనక్కి తగ్గేదే లేదని, ప్రజల మద్దతుతో బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని మీనాక్షి నటరాజన్‌ తేల్చిచెప్పారు.


ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 21 , 2026 | 03:57 PM