Share News

బంగ్లా టీ20 ప్రపంచ కప్ ఆడనుందా? కెప్టెన్ లిట్టన్ దాస్ స్పందనిదే..

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:31 AM

భారత్‌లో టీ20 ప్రపంచ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ ఈ విషయంపై స్పందించాడు. ప్రపంచ కప్‌ ఆడటంపై తాము మాట్లాడటం సురక్షితం కాదని వెల్లడించాడు.

బంగ్లా టీ20 ప్రపంచ కప్ ఆడనుందా? కెప్టెన్ లిట్టన్ దాస్ స్పందనిదే..
Litton Das

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ పాల్గొంటుందా? లేదా? ప్రస్తుతం.. విపరీతంగా జరుగుతోన్న చర్చ ఇదే. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించడంతో దుమారం చెలరేగింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో బంగ్లాతో జరగనున్న టీ20 ప్రపంచ కప్(T20 World Cup) మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బీసీబీ.. ఐసీసీని కోరింది. ఈ విషయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లా టీ20 జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్‌కు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. అయితే.. అతడు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించాడు.


బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన లిట్టన్ దాస్‌ను వరల్డ్‌ కప్‌ సన్నాహాలపై ప్రశ్నించారు. టోర్నీకి ఇంకా రెండు వారాలే ఉండగా, బంగ్లాదేశ్‌ జట్టు పాల్గొనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన(Litton Das) వ్యాఖ్యానించారు. ‘మేం వరల్డ్‌ కప్‌ ఆడతామా? ఆడమా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నాకే కాదు.. జట్టులోని ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. ప్రస్తుతం.. బంగ్లాదేశ్‌ మొత్తం అనిశ్చితిలోనే ఉంది. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. కానీ దానికి సమాధానం నేను ఇవ్వలేను. అలా సమాధానం ఇవ్వడం నాకు సురక్షితం కాదు’ అని లిట్టన్ చెప్పుకొచ్చారు.


ఐసీసీ ఒత్తిడికి తలొగ్గం: బీసీబీ

భారత్‌లో పర్యటించేందుకు బంగ్లా నిరాకరిస్తే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడించాలని ఐసీసీ(ICC) భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ విషయం గురించి ఐసీసీ తమకు అధికారిక సమాచారం అందించలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అన్నారు. ‘ఒత్తిడి చేసి మమ్మల్ని భారత్‌లో మ్యాచ్‌లు ఆడించలేరు. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని ఐసీసీ మాకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.’ అని నజ్రుల్ వివరించారు. మరోవైపు.. ఐసీసీ తమతో ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్కాట్లాండ్ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 21 , 2026 | 10:59 AM