Share News

Rinku Singh: సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:03 PM

టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అతడు పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సరదాగా చేసిన ఈ పని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.

Rinku Singh: సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!
Rinku Singh

ఇంటర్నెట్ డెస్క్: మరి కొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అతడు పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సరదాగా చేసిన ఈ పని.. అతడిని అనవసరమైన వివాదంలోకి నెట్టింది.


రింకూ(Rinku Singh) పోస్ట్ చేసిన వీడియో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ కర్ణి సేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది సనాతన ధర్మాన్ని కించపరచడమేనని ఆరోపించింది. హిందువులందరికీ వెంటనే రింకూ సింగ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకపోతే పెద్దఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది.


ఆ వీడియోలో ఏముందంటే..

రింకూ సింగ్ ఫేస్‌బుక్ వేదికగా షేర్ చేసిన ఆ వీడియోలో ఓ వైపు అతడు సిక్సర్లు బాదుతుండగా.. మరోవైపు హిందూ దేవుళ్లు హనుమంతుడు, శివుడు, విష్ణువు, వినాయకుడు.. థార్ కారులో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. ఏఐ సాయంతో జనరేట్ చేసిన ఈ వీడియోలో హనుమంతుడు కారు నడుపుతుండగా.. శివుడు, విష్ణువు, వినాయకుడు వెనుక సీట్లో కూర్చొన్నారు. దేవుళ్లంతా సన్ గ్లాసెస్ పెట్టుకుని మోడ్రన్‌గా కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో ఇంగ్లిష్ పాట నడుస్తుండగా.. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించారు. ఈ వీడియోకు రింకూ.. ‘నిన్ను క్రికెటర్‌గా ఎవరు చేశారో తెలుసా?’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. సరదాగా చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదానికి తెరతీసింది.


ప్రస్తుతం రింకూ సింగ్.. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. బుధవారం నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. కివీస్‌తో మూడు వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన భారత్.. టీ20 సిరీస్‌ను పట్టేయాలన్న పట్టుదలతో ఉంది. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

ముందు బాగా కష్టపడాలి.. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు!

Updated Date - Jan 20 , 2026 | 02:47 PM