WPL 2026: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. తమ విజయ రహస్యాన్ని చెప్పేసిన స్మృతి మంధాన
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:49 AM
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీకి ఎదురు లేకుండా పోయింది. అజేయ రికార్డును కొనసాగిస్తూ ఆ జట్టు ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అరంగేట్రంలోనే గౌతమి నాయక్ మెరుపులు.. బౌలింగ్‌లో సయాలి, డిక్లెర్క్‌ల బీభత్సానికి గుజరాత్ జట్టు బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఆర్సీబీ(RCB) ప్లేఆఫ్స్‌తో స్థానాన్ని ఖరారు చేసుకుంది. వరుసగా ఆరు మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. మ్యాచ్ అనంతరం తమ విజయ రహస్యంపై కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) స్పందించింది.
‘ఇది(WPL 2026) ఆర్సీబీకి నిజంగా ప్రత్యేకమైన అనుభవం. పది రోజుల తర్వాత ఏం జరగనుందా? అని ఆలోచించే కన్నా ప్రస్తుతం ఏం చేయాలన్న దానిపై శ్రద్ధపెట్టాలి. రోజూ మనం చేసే చిన్న విషయాలను కూడా దృష్టి పెట్టి చేయాలి. పని చిన్నదే కదా చేసేద్దాం.. అన్నట్లు వదిలేస్తే అవే పెద్ద సమస్యలుగా మారతాయి. ఇప్పుడు మేం ప్రతి మ్యాచులోనూ చేసేది అదే. ఒక్కో మ్యాచ్‌ను ఒక్కో గుణపాఠంగా తీసుకుంటున్నాం. గెలిచినప్పటికీ మా లోపాలను గుర్తించి వాటిపై దృష్టి సారిస్తున్నాం. అదే మా విజయ రహస్యం. దానికి తోడు జట్టులోని అందరూ ఎంతో కష్టపడుతున్నారు. మా సపోర్ట్ స్టాఫ్‌నకూ పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. వారు జట్టును ఎప్పుడూ సానుకూలంగా, ఆనందంగా ఉంచుతున్నారు. అదే మాకు మంచి వాతావరణాన్ని ఇస్తోంది’ అని స్మృతి వెల్లడించింది.
డీసీతో తదుపరి పోరు..
షెడ్యూల్ ప్రకారం.. ఆర్సీబీ మహిళల జట్టు జనవరి 24న ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా వడోదరలోని కోటాంబి స్టేడియంలోనే జరగనుంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ఉంది. జెమీమా రోడ్రిగ్స్ నాయకత్వంలో ఉన్న ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటే గెలిచింది. ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని ఢిల్లీ ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆటకు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్