Saina Nehwal: ఆటకు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:22 AM
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీర్ఘకాలికంగా గాయాలు వెంటాడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో ఇప్పటికే ఆటకు దూరంగా ఉన్న సైనా.. ఇక ఆడలేనని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికారు. మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా(Saina Nehwal).. తాను ఇక ఆడలేనని ఓ పాడ్‌కాస్ట్ వేదికగా చెప్పారు. దీర్ఘకాలిక గాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
‘రెండేళ్ల క్రితమే ఆడటం మానేశా. నా అంతట నేనే ఆటలోకి వచ్చా.. నా అంతట నేనే నిష్క్రమిస్తున్నా. ప్రత్యేకంగా రిటైర్‌మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదనుకున్నా. ఏ మాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసినట్లే. ఆర్థరైటిస్ వచ్చింది.. కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక నేను ఆ స్థాయిలో ఆడలేనని నా తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పాల్సి వచ్చింది. మరేం పర్వాలేదు. ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన సైనా.. ఇక ఆడటం లేదని అభిమానులు క్రమంగా అర్థం చేసుకుంటారు. తేలిక పాటి శిక్షణకే మోకాళ్లు సహకరించడం లేదు. అందుకే ఈ నిర్ణయం తప్పనిసరి అయింది. ఇంతకు ముందు రోజుకు 8 నుంచి 9 గంటలు శిక్షణ తీసుకునేదాన్ని. ఇప్పుడు గంట, రెండు గంటల్లోనే మోకాలు వాపు వచ్చేస్తోంది. అప్పుడు అనిపించింది.. ఇక ఆటను ముందుకు నెట్టలేను అని’ అని సైనా స్పష్టం చేశారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా.. చివరి సారిగా 2023 సింగపూర్ ఓపెన్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి మోకాళ్ల నొప్పులతో పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఎదురైన మోకాలి గాయం ఆమె కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయినప్పటికీ, 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత కూడా గాయాలు వెంటాడుతూనే వచ్చాయి. 2024లోనే ఆర్థరైటిస్ వచ్చిందని, ఎలైట్ స్థాయిలో పోటీ పడేంత శక్తి ఇక లేదని సైనా వెల్లడించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన సైనా నెహ్వాల్, ఆటకు వీడ్కోలు పలికినా.. ఆమె స్ఫూర్తి మాత్రం తరతరాలకు మార్గదర్శకంగా నిలవనుంది.
ఇవి కూడా చదవండి:
రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?
అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..