Share News

ఆఖరి అవకాశం

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:52 AM

ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ ద్వారా భారత జట్టు ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీకి సన్నద్ధం కావాలనుకుంటోంది. వాస్తవానికి ఈ ఫార్మాట్‌లో చివరిసారి భారత జట్టు ఆరు నెలల క్రితం ఆడడం గమనార్హం....

ఆఖరి అవకాశం

ఫామ్‌ కోసం రోహిత్‌, కోహ్లీ తంటాలు

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ రేపటి నుంచే

ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ ద్వారా భారత జట్టు ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీకి సన్నద్ధం కావాలనుకుంటోంది. వాస్తవానికి ఈ ఫార్మాట్‌లో చివరిసారి భారత జట్టు ఆరు నెలల క్రితం ఆడడం గమనార్హం. ఆ తర్వాత మళ్లీ బుధవారం నుంచి 50 ఓవర్ల మ్యాచ్‌ ఆడబోతోంది. మరోవైపు బట్లర్‌ సేనతో జరిగే ఈ మూడు వన్డేలు కూడా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరూ తమ ఫామ్‌ను అందుకునేందుకు ఈ సిరీ్‌సను చివరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది. ఇద్దరికీ ఆసీస్‌ పర్యటన చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీనికితోడు ఆడిన ఏకైక రంజీ మ్యాచ్‌లోనూ విఫలమయ్యారు. జమ్మూ-కశ్మీర్‌పై రోహిత్‌ 3, 28 రన్స్‌ చేయగా.. విరాట్‌ రైల్వే్‌సపై ఆరు పరుగులే చేసి బౌల్డయ్యాడు. అయితే వన్డే ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రోహిత్‌, వన్‌డౌన్‌లో విరాట్‌ మెరుగైన ప్రదర్శనే కనబరుస్తుంటారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై రోహిత్‌ మూడు మ్యాచ్‌ల్లో 157 పరుగులు సాధించాడు. కానీ ఆ తర్వాతే తన ప్రదర్శన దిగజారుతూ వచ్చింది. ఇక విరాట్‌ ఆ సిరీ్‌సలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ ఫీట్‌కు తను 94 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆఫ్‌సైడ్‌ ఆవలి బంతులను వేటాడే బలహీనతను వీలైనంత త్వరగా అధిగమించి.. భారీగా పరుగులను సాధిస్తే జట్టుకు అంతకు మించిన ప్రయోజనం ఉండదు. ఇదిలావుండగా చాంపియన్స్‌ ట్రోఫీలో రోహిత్‌, విరాట్‌ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్‌ విజయావకాశాలు మెరుగవుతాయని మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు.


బౌలర్ల ఫిట్‌నెస్‌ కీలకం

భారత జట్టులో ముగ్గురు బౌలర్లు గాయాల నుంచి కోలుకుని బరిలోకి దిగబోతున్నారు. స్టార్‌ పేసర్‌ బుమ్రా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో పరీక్షల కోసం ఉన్న తను ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక స్పిన్నర్‌ కుల్దీప్‌ గతేడాది అక్టోబరు నుంచి భారత్‌ తరఫున బరిలోకి దిగలేదు. గతవారం రంజీ మ్యాచ్‌ ఆడి మూడు వికెట్లు తీశాడు. అలాగే పేసర్‌ షమి ఏడాది బ్రేక్‌ తర్వాత దేశవాళీతో పాటు ఐదు టీ20ల సిరీ్‌సలో ఆడాడు. చాంపియన్స్‌ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుంటే వీరితో పాటు పేసర్‌ అర్ష్‌దీప్‌ ఫిట్‌నెస్‌ కూడా కీలకం కానుంది.


కీపింగ్‌ బాధ్యతలు ఎవరికి?

రోహిత్‌, గిల్‌ ఓపెనర్లుగా రానుండగా విరాట్‌, శ్రేయాస్‌ ఆ తర్వాతి స్థానాల్లో బరిలోకి దిగడం ఖాయమే. అయితే వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సిరీస్‌ కోసమే కాకుండా చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఐదో స్థానం కోసం రిషభ్‌ పంత్‌-కేఎల్‌ రాహుల్‌ల మధ్య పోటీ నెలకొంది. 2023 ఆగస్టు నుంచి ఈ ఫార్మాట్‌లో రాహుల్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్నాక, గతేడాది ఆగస్టులో శ్రీలంకపై మూడో మ్యాచ్‌లో కీపింగ్‌ చేసిన పంత్‌ ఆరు పరుగులే చేశాడు. అటు ఆసీస్‌ పర్యటనలో రాహుల్‌ పది ఇన్నింగ్స్‌లో 276 పరుగులు చేస్తే.. పంత్‌ తొమ్మిది ఇన్నింగ్స్‌లో 255 రన్స్‌ సాధించాడు. ఇక ఇద్దరికీ ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీ్‌సలో చోటు దక్కలేదు. ఒకవేళ తాజా సిరీ్‌సలో రాహుల్‌కు చోటు కల్పిస్తే టాప్‌-6లో ఎడమచేతి బ్యాటర్‌ ఉండడు. ఇందుకోసం స్పిన్‌ ఆల్‌రౌండర్లలో ఒకరిని ప్రమోట్‌ చేయాల్సి ఉంటుంది. అదే ఇద్దరినీ తీసుకుంటే శ్రేయా్‌సను తప్పించి రాహుల్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించాల్సి ఉంటుంది.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)


ఇదీ చదవండి:

భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..

స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్

బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:52 AM