కఠిన నిర్ణయమే.. తప్పలేదు
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:45 AM
దేశ క్రీడా ముఖ చిత్రానికి తన రాకెట్‌తో కొత్త సొబగులద్దిన ఆమెను ఇకపై బ్యాడ్మింటన్ కోర్టులో చూడలేము. రెండేళ్లుగా తన శరీరం సహకరించకపోయినా ఇంకా ఆడాలన్న తపన ఆమెను బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు...
త్వరగా ముగిసిపోయినట్టు అనిపించిందిఫ
ఇప్పుడే కోచ్ కావాలనుకోవడం లేదు
దేశ క్రీడా ముఖ చిత్రానికి తన రాకెట్‌తో కొత్త సొబగులద్దిన ఆమెను ఇకపై బ్యాడ్మింటన్ కోర్టులో చూడలేము. రెండేళ్లుగా తన శరీరం సహకరించకపోయినా ఇంకా ఆడాలన్న తపన ఆమెను బ్యాడ్మింటన్‌కు వీడ్కో లు పలకకుండా ఆపింది. మునుపటి వేగాన్ని ఇకపై అందుకోలేనని తెలిసి.. కఠిన నిర్ణయమే అయినా తప్పని స్థితిలో బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ గుడ్‌బై చెప్పింది. మూడు కామన్వెల్త్ స్వర్ణాలు, రెండు ఆసియాడ్ పతకాలు, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం అన్నింటికి మించి వరల్డ్ నెంబర్ వన్ టైటిల్.. ఇలా చెప్పుకుంటే పోతే సైనా నెహ్వాల్ లిఖించిన రికార్డులు అనేకం. తన బ్యాడ్మింటన్ జీవిత విశేషాల గురించి ఆంధ్రజ్యోతితో సైనా పంచుకున్న విశేషాలు...
ఆమె మాటల్లోనే..
క్రీడాకారుల కెరీర్‌లో ప్రతి ఒక్కరు ఏదోఒక దశలో ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. నా విషయంలో ఆ సమ యం ఇప్పుడు వచ్చింది. రెండున్నర దశాబ్దాలకుపైగా బ్యాడ్మింటన్‌తో సహ జీవనం చేశా. వీడ్కోలు పలకాలన్న నిర్ణయం కఠినమైనదే కానీ, తప్పలేదు. 2023 సింగపూర్ ఓపెన్ తర్వాత మోకాలి సమస్యపై వైద్యులను సంప్రదించా. మోకాలులోని కార్టిలేజ్‌ను పునరుద్ధరించలేమని చెప్పారు. అలాగే ఆర్ధరైటిస్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మునుపటిలా రోజుకు 8-9 గంటలు సాధన చేయడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ప్రస్తుత పోటీని తట్టుకొని నిలబడాలంటే నేను చేసే 1-2 గంటల సాధన సరిపోదు. ఆ ప్రాక్టీసు తర్వాత కూడా కాళ్ల వాపు, నొప్పులు రావడంతో చాలా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. ఇక, పాత ఫామ్‌ను అందుకునేందుకు నా శరీరం సహకరించదని తెలుసుకున్నా. అందుకే రెండేళ్లుగా ఆటకు పూర్తిగా దూరమయ్యా. ఇదే విషయాన్ని నా కుటుంబ సభ్యులు, కోచ్‌లకు కూడా తెలియజేశా.

మానసికంగా ఆడాలని ఉన్నా..
సుదీర్ఘ ప్రయాణమే కానీ ఎందుకో కెరీర్ త్వరగా ముగిసిపోయినట్టు అనిపించింది. ఇప్పటికీ ఆడాలని మనసులో ఉంది కానీ, శరీరం సహకరించదని తెలిసి ఆ ప్రయత్నం చేయకపోవడమే శ్రేయస్కరమని ఈ నిర్ణ యం తీసుకున్నా. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సం తోషంగా అనిపిస్తోంది. వరల్డ్ నెంబర్‌వన్ కిరీటం, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కెరీర్‌లో అత్యంత ఆనందాన్నిచ్చిన విజయాలు. ఈ ప్రయాణంలో నా వెన్నంటే నిలిచిన తల్లిదండ్రులకు, సహకరించిన కోచ్‌లకు, మిత్రులకు ధన్యవాదాలు.
ఆ సమయంలో అర్థం కాలేదు..
ఉదయాన్నే నిద్ర లేవడం, బస్సుల్లో ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర వ్యక్తిగత త్యాగాల గురించి ఆ సమయంలో అర్థం కాలేదు. వాటి ప్రతిఫలం ఆ తర్వాత చూశా. మంచి పెంపకం అంటే పిల్లలను కఠినంగా నియంత్రించడం, నిబంధనలు విధించడం కాదు. ఎలాంటి పరిస్థితులనైనా ఒంటరిగా ఎదుర్కోగలిగేవారిగా తీర్చిదిద్దినప్పుడే వారు విజయవంతమవుతారు. ఈ విషయంలో నా తల్లిదండ్రులు పడిన శ్రమ, వారు చేసిన త్యాగాలు నేను పెరిగేకొద్దీ అర్థమయ్యాయి. వారే లేకపోతే నేనీ స్థాయిలో ఉండేదాణ్ణి కాను.
వాంగ్, తైజుతో గట్టి పోటీ..
ఒలింపిక్స్‌తో సహా ప్రతీ పోటీలోనూ అనేక క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కొన్నా. అయితే, అన్ని పోటీల్లో వాంగ్ యి హాన్ (చైనా), తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో పోరును బాగా ఆస్వాదించేదాన్ని. వీరితో ఆట కోర్టుపై యుద్ధంలానే ఉండేది.
ఇప్పుడే కోచింగ్ చేపట్టను..
ప్లేయర్‌గా కెరీర్‌కు వీడ్కోలు పలికా కాబట్టి వెంటనే కోచ్‌గా మారిపోవాలని లేదు. కొంత సమయం తీసుకొని కొన్నేళ్ల తర్వాత ఆ విభాగంలోకి అడుగుపెడతా. అంతవరకు యువ షట్లర్లకు అవసరమైన సలహాలు, సూచనలిస్తా.
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)
ఇవి కూడా చదవండి:
రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. వివాదంలో రింకూ సింగ్!