అతి ప్రయోగాల వల్లే టీమిండియాకు ఈ పరిస్థితి: అజింక్య రహానే
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:42 AM
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సిరీస్‌లను కోల్పోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచులో గెలిచిన భారత్.. రాజ్‌కోట్, ఇండోర్ మ్యాచుల్లో ఓటమి పాలైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(124) మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీ చేసినా జట్టుకు పరాజయం తప్పలేదు. గతేడాది స్వదేశంలోనే టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్ జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ దక్కించుకుని టీమిండియాకు షాక్ ఇచ్చింది. స్వదేశంలో సిరీస్‌లను కోల్పోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) స్పందించాడు.
‘టీమిండియా చివరి తొమ్మిది వన్డేల్లో ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైంది. దీనంతటికీ జట్టు కూర్పులో విపరీతమై మార్పులు చేయడమే కారణం. ప్రపంచ కప్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నప్పుడు ఆటగాళ్లకు భరోసా అవసరం. జట్టుపై అతిగా ప్రయోగాలు చేయడం ఇకనైనా ఆపాలి. మేనేజ్మెంట్ నుంచి ఈ విషయంలో క్రికెటర్లకు ఓ క్లారిటీ ఉండాలి. ప్రతి భారతీయుడూ టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తాడు. మ్యాచులు, సిరీస్‌లను గెలవాలని కోరుకుంటారు. ముఖ్యంగా స్వదేశంలో జరిగే మ్యాచుల్లో అస్సలు ఓటమిపాలు కావొద్దని అనుకుంటారు. యువ ప్లేయర్లతో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
వాస్తవానికి న్యూజిలాండ్ ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడింది. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శనలు ఇచ్చింది. టీమిండియా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. ఇందుకోసం చాలా సమయం ఉంది. భారత్ మళ్లీ ఆరు నెలల తర్వాతే వన్డే సిరీస్ ఆడనుంది. ఇప్పుడు జరిగిన తప్పులను మళ్లీ జరగకుండా మేనేజ్మెంట్, కోచ్‌లు బాధ్యత వహించాలి’ అని అజింక్య రహానే అన్నాడు.
ఇవి కూడా చదవండి:
రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. వివాదంలో రింకూ సింగ్!