Share News

Bangladesh: అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:56 AM

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.

Bangladesh: అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?
Mustafizur Rahman

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్‌ ముస్తాఫిజూర్‌ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ(BCCI) సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.


అయితే ఇదే అంశం భారత్‌-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌ 2026కి సంబంధించి భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించేలా ప్రణాళికలు చేయాలని ఐసీసీకి లేఖ రాయమని ఆయన బీసీబీ(BCB)కి సూచించారు. పాకిస్తాన్ తరహాలోనే ఈ నిర్ణయం ఉండాలని అభిప్రాయపడ్డారు.


ఊరుకోం..

ఇదే కాదు, ఐపీఎల్‌ ప్రసారాలపై కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ‘బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌(IPL) ప్రసారాన్ని నిలిపివేయాలని సమాచార, ప్రసార శాఖ సలహాదారుని కోరాను. మా క్రికెట్‌ను, మా క్రికెటర్లను, మా దేశాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. మీరు చెప్పినట్టు వినే రోజులు ఎప్పుడో ముగిశాయి’ అని నజ్రుల్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా, ముస్తాఫిజూర్‌ ఒప్పందం రద్దు విషయమై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB)లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ‘ముస్తాఫిజూర్‌ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారన్న విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి లేఖా రాలేదు. అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.


2016 నుంచి ఇప్పటివరకు ఎనిమిది ఐపీఎల్‌ సీజన్లలో ముస్తాఫిజూర్‌ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు, ఈ సీజన్‌లో తొలిసారి కేకేఆర్ తరఫున ఆడాల్సి ఉంది. కానీ రాజకీయ అలజడుల్లో అతడి ఐపీఎల్‌ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది.


ఇవి కూడా చదవండి:

ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!

Updated Date - Jan 04 , 2026 | 11:05 AM