Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:29 AM
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో బంగ్లా ఆడే మ్యాచుల వేదికలు మార్చాలని ఐసీసీని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా.. ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ జట్టును బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో బంగ్లాదేశ్ జట్టు ఆడే 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచుల వేదికలు మార్చాలని ఐసీసీని సంప్రదించాలని భావిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదికలు మార్చాలని ఐసీసీ(ICC) దృష్టికి తీసుకెళ్తామని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
‘ముస్తాఫిజుర్‌ను(Mustafizur Rahman) ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంపై నేను ఏమీ మాట్లాడను. ఎందుకంటే అది వారి అంతర్గత విషయం. కానీ ప్రపంచ కప్‌లో పాల్గొనడం విషయానికొస్తే ఇది ఐసీసీ ఈవెంట్. టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించిన విషయాన్ని ఐసీసీతో వీలైనంత త్వరగా బీసీబీ చర్చిస్తుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు వెళ్లి ఆడటానికి టీమిండియా నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్, 17న వాంఖడేలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. ఆ డబ్బులు రిఫండ్ అవుతాయా?