The Ashes: ఉగ్రదాడి.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సిడ్నీ టెస్టు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:36 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే బోండీ బీచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానం లోపల, వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే బోండీ బీచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానం లోపల, వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సాయుధులైన పోలీసులు గస్తీ కాస్తారని న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమిషనర్ మాల్ లాన్యోన్ శనివారం తెలిపారు. మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరిగిన నేపథ్యంలో తీసుకున్న పటిష్ట చర్యలనే సిడ్నీలోనూ కొనసాగించనున్నారు. పోలీసులు మైదానంతో పాటు, సమీపంలో పార్క్, రైల్వే స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో కాల్పులు జరిపి 15 మంది మృతికి కారణమైన ఉగ్రవాది నవీద్ అక్రమ్‌పై పోలీసులు 59 అభియోగాలను నమోదు చేశారు. అందులో 15 హత్య కేసులున్నాయి. మరో ఉగ్రవాది సాజిద్ హతం కావడంతో నవీద్ ఒక్కడి పైనే ఈ అభియోగాలను పోలీసులు మోపిన విషయం తెలిసిందే. చనిపోయిన ప్రతిఒక్కరి హత్యకు కారణమంటూ పోలీసులు విడివిడిగా అతడిపై 15 కేసులు నమోదు చేశారు. కాల్పులకు సంబంధించి 40 కేసులు పెట్టారు. పేలుడు పదార్థాలు తదితర నేరాలపై మరో నాలుగు కేసులు నమోదు చేశారు.
అయిదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం 3-1 ఆధిక్యంలో ఉంది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను విజయంతో ముగించాలని ఆ జట్టు చూస్తోంది. నాలుగో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో అయిదో మ్యాచ్ జరగనున్న సిడ్నీలో పిచ్ ఎలా స్పందిస్తుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. ఆ డబ్బులు రిఫండ్ అవుతాయా?