Share News

The Ashes: 138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:28 AM

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 138 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది.

The Ashes: 138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!
Steve Smith

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగుతోంది. అయితే ఈ మ్యాచులో ఆతిథ్య ఆసీస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏకంగా 138 ఏళ్ల ఓ అరుదైన రికార్డుకు బ్రేక్ పడింది. సాధారణంగా సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. కానీ ఈ మ్యాచు(The Ashes)లో ఆసీస్ జట్టు ఎలాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగింది.


1888 తర్వాత అంటే ఆస్ట్రేలియా జట్టు స్పిన్ బౌలర్ లేకుండా ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. సిడ్నీ లాంటి పిచ్‌లో స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగాలనే స్మిత్ నిర్ణయం సాహసోపేతమైనదే. మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీని తమ 12 మంది సభ్యుల జాబితాలో చేర్చినప్పటికీ, మ్యాచ్ రోజున కెప్టెన్ అతన్ని చివరి ఎలెవెన్‌లో చేర్చలేదు.


బ్యూ వెబ్‌స్టర్ జట్టులో చోటు..

ఇంగ్లాండ్‌తో జరిగిన సిడ్నీ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా స్పిన్ ఆప్షన్‌కు బదులుగా మీడియం-పేస్డ్ ఆల్ రౌండర్‌ను ఎంచుకుంది. చివరి టెస్ట్ కోసం స్టీవ్ స్మిత్ బ్యూ వెబ్‌స్టర్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. వెబ్‌స్టర్ కుడిచేతి వాటం మీడియం-పేసర్, బ్యాటింగ్ ఆల్ రౌండర్. సిడ్నీ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీ టెస్ట్ కోసం క్యూరేటర్ పిచ్‌పై తేలికపాటి గడ్డి కవర్‌ను వదిలివేశాడు. తద్వారా స్పిన్నర్లు అక్కడ అంత ప్రభావవంతంగా ఉండరని స్మిత్ భావించాడు.


ఇదిలా ఉండగా.. ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 45 ఓవర్లు ముగిసే వరకు 3 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా మ్యాచును తాత్కాలికంగా నిలిపేశారు. క్రీజులో జో రూట్(72), హ్యారీ బ్రూక్(78) ఉన్నారు. కాగా ఈ సిరీస్‌లో 3-1తేడాతో ఆసీస్ సిరీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!

Updated Date - Jan 04 , 2026 | 10:49 AM