ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:22 PM
ఢిల్లీ ఫ్రాంచైజీ తీసుకుంటున్న ట్రేడింగ్ నిర్ణయాలపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుల్దీప్ను వదులుకోవడం వల్ల ఢిల్లీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రేడింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు, సీనియర్ పేసర్ టి.నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రేడింగ్ ద్వారా పంపించేసింది. వారి స్థానాల్లో రిషభ్ పంత్, జీషాన్ అన్సారీని జట్టులో చేర్చుకుంది. అయితే ఢిల్లీ ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయాలపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ట్రేడ్ ద్వారా ఢిల్లీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
‘ఢిల్లీ క్యాపిటల్స్.. అసలు మీరేం చేస్తున్నారు? ఈ ట్రేడ్ ఒప్పందం తర్వాత మీ జట్టు మరింత బలంగా మారిందని అనుకుంటున్నారా? కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు దేశంలో ఎంతమంది ఉన్నారు? అతడిని భర్తీ చేయడం దాదాపు అసాధ్యం. మరోవైపు పంత్ కూడా మంచి ప్లేయరే.. కానీ అతడు జట్టుకు అవసరమా? మిడిల్ ఆర్డర్లో పంత్‌కు చోటుందా? అనేది కూడా ఆలోచించాలి. ఈ ఒప్పందం ద్వారా లఖ్‌నవూ జట్టుకే ఎక్కువ ప్రయోజనం చేకూరింది. కుల్దీప్ స్థానంలో మరో స్పిన్నర్ కావాలి. మీ దగ్గర విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ ఉన్నారు. అయినప్పటికీ జీషాన్ అన్సారీని తీసుకున్నారు. నటరాజన్‌ను వదిలేశారు.. ఆకిబ్ నబీ, ముకేశ్ కుమార్‌లను కూడా రిలీజ్ చేయాల్సి రావచ్చు. ఇన్ని మార్పుల తర్వాత మీ జట్టు మెరుగుపడిందా? అనేదే అసలు ప్రశ్న. ఇప్పటికైతే ఢిల్లీ నిర్ణయాలతో నేను ఏకీభవించడం లేదు. కుల్దీప్-పంత్ ఒప్పందం విషయంలో లఖ్‌నవూ, నటరాజన్ విషయంలో హైదరాబాద్ సంతోషంగా ఉంటాయి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితేంటి?’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.
ప్లేఆఫ్స్ కష్టాలకు పరిష్కారం దొరికేనా?
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గత ఐదు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టును బలోపేతం చేసేందుకు యాజమాన్యం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సౌరభ్ గంగూలీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. మరోవైపు పంత్‌ను తక్కువ జీతంతో తిరిగి తీసుకోవడం, నటరాజన్ ట్రేడ్‌తో రూ.10.35 కోట్ల మేర పర్స్‌లో నిధులు అందుబాటులోకి రావడం ఢిల్లీకి వేలంలో అదనపు వెసులుబాటు కల్పించనున్నాయి. డిసెంబర్ మధ్యలో జరగనున్న ఐపీఎల్-2027 మినీ వేలంలో ఈ నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే కుల్దీప్ వంటి కీలక ఆటగాడిని వదులుకోవడం సరైన నిర్ణయమేనా? కొత్తగా వచ్చిన ఆటగాళ్లు ఆ లోటును భర్తీ చేయగలరా? అన్నది వచ్చే సీజన్లోనే తేలనుంది.
ఇవీ చదవండి:
‘ఫుట్‌పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక
‘నా కూతురిని నేనే చంపేశా’.. 911కు తల్లి ఫోన్ కాల్