అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. తిలక్ వర్మ తుది జట్టులో ఉంటాడా?: ఏబీ డివిలియర్స్
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:51 AM
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కూర్పుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తుది జట్టులో ఉంటాడా? ఉంటే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు? అనే ప్రశ్నను దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ లేవనెత్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కూర్పుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తుది జట్టులో ఉంటాడా? ఉంటే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు? అనే ప్రశ్నను దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ లేవనెత్తాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘బ్యాటర్ల విషయంలో ఎవరిని ఎంపిక చేయాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే అంశం చాలా కష్టమైనది. శ్రేయస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇషాన్ కిషన్, శాంసన్, సూర్యవంశీ ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే తిలక్ వర్మ ఉన్నాడు. ఇక్కడే జట్టు సమతూకం కాస్త క్లిష్టంగా మారుతుంది. తిలక్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు? భారత్ వద్ద చాలా బలమైన జట్టు ఉంది. అయితే జట్టు సమతూకాన్ని ఎలా సాధిస్తారన్నదే ఆసక్తికరం. టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్లను కొంత అటు ఇటుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఆటగాడి పాత్రపై స్పష్టత ఉండటం ఎంతో కీలకం. ఎందుకంటే అఫ్గానిస్థాన్ జట్టును ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం’ అని ఏబీడీ వెల్లడించాడు.
షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20
మరోవైపు ఢిల్లీ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌లూ అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. తొలి టీ20పై గతంలో కొంత గందరగోళం నెలకొంది. మ్యాచ్‌ను వాయిదా వేయాలని ఢిల్లీ పోలీసులు కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. సెప్టెంబరు 13న జరగాల్సిన తొలి టీ20 షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ప్రకటించింది. ఢిల్లీలో సెప్టెంబరు 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులతో సమావేశమైన అనంతరం మ్యాచ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సహకారం అందిస్తామని హామీ లభించినట్టు డీడీసీఏ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్
సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు