Share News

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?

ABN , Publish Date - Sep 12 , 2026 | 07:44 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్‌లో కలిశాడు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో క్రీడలు, మౌలిక వసతులు, మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇరువురూ చర్చించారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్‌లో కలిశాడు. శుక్రవారం జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో క్రీడలు, మౌలిక వసతులు, మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇరువురూ చర్చించారు. ఈ మేరకు ఏక్‌నాథ్ షిండే ఈ విషయంపై ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కోహ్లీ నిరాడంబరతను చూసి ఆశ్చర్యపోయాయనని తెలిపారు.


‘నేను లండన్‌లో ఉన్నానని తెలుసుకున్న విరాట్‌ నన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. ఇంతటి గొప్ప భారత క్రికెటర్‌, అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు ఇంత నిరాడంబరంగా ఉండటం చూసి చాలా సంతోషించాను. గతంలో కూడా మేము కలిశాం. అయితే ఈరోజు అతడితో నేరుగా మాట్లాడటం ప్రత్యేకంగా ఆనందంగా అనిపించింది. మహారాష్ట్రలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి గురించి చర్చించుకున్నాం. విమానాశ్రయం సమీపంలో చేపడుతున్న ‘థర్డ్‌ ముంబై’ అభివృద్ధి, అటల్‌ సేతు, బాలాసాహెబ్‌ ఠాక్రే సమృద్ధి మహామార్గ్‌, కోస్టల్‌ రోడ్‌, మెట్రో ప్రాజెక్టులు, పాఠశాలలు, వైద్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించా. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అభివృద్ధి అపూర్వమని విరాట్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు’ అని షిండే వెల్లడించారు.


దేశ భవిష్యత్తు యువతేనని, వారిలోని ప్రతిభను వెలికితీసి పోటీల్లో రాణించేలా చేయాల్సిన అవసరం ఉందని ఇరువురూ అభిప్రాయపడినట్టు షిండే తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోహ్లీ కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడని చెప్పారు. ఇవి మహారాష్ట్రతో పాటు దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Sep 12 , 2026 | 08:16 AM