నగరం మధ్యలో ‘ఎస్కలేటర్’
ABN , Publish Date - May 03 , 2026 | 01:22 PM
నగరాల్లో కొండలను పిండి చేసి భారీ భవనాలు నిర్మించడం చూస్తూనే ఉంటాం. ఎత్తయిన ప్రదేశాల్లో కట్టడం వల్ల... అక్కడికి రోడ్లు వేసినా అధిక లోడు ఉన్న వాహనాలు వెళ్లాలంటే కష్టమే.
నగరాల్లో కొండలను పిండి చేసి భారీ భవనాలు నిర్మించడం చూస్తూనే ఉంటాం. ఎత్తయిన ప్రదేశాల్లో కట్టడం వల్ల... అక్కడికి రోడ్లు వేసినా అధిక లోడు ఉన్న వాహనాలు వెళ్లాలంటే కష్టమే. ఆ మాటకొస్తే నడిచి వెళ్లాలన్నా పగటిపూటే చుక్కలు కనిపిస్తాయి. అలాంటి చోట్ల చైనా ‘అవుట్ డోర్ ఎస్కలేటర్లు’ ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే ‘గాడ్డెస్ ఎస్కలేటర్’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎస్కలేటర్‌ను ప్రారంభించింది.
పెద్ద పెద్ద మాల్స్‌లో ఎస్కలేటర్లు చూసే ఉంటారు. మెట్రోస్టేషన్లలో పొడవైన ఎస్కలేటర్లపై ఎక్కే ఉంటారు. ఇవన్నీ పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడేవే. కానీ చైనా ఏకంగా ఆరుబయట ప్రధాన రహదారుల్లో... ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లడానికి ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. చైనాలోని వుషాన్ కౌంటీలో కనిపిస్తుందీ డ్రాగన్ లాంటి ఎస్కలేటర్. ఒక్క చెమట చుక్క చిందకుండా ఎత్తైన ప్రదేశాలకు చేరుకునేందుకు కదిలే మెట్లను ఏర్పాటు చేశారు. ఈ ఎస్కలేటర్‌పై ఎక్కేందుకు జనం అమితాసక్తి కనబరుస్తున్నారు.
గిన్నిస్ రికార్డు
మూడు వేల అడుగుల పొడవున్న ఈ ఎస్కలేటర్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ‘అవుట్‌డోర్ ఎస్కలేటర్’గా గుర్తింపు పొందింది. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు’ల్లోనూ స్థానం సంపాదించుకుంది. ఈ ఎస్కలేటర్‌పై సుమారు ఒక కిలోమీటరు మేర ప్రయాణిస్తారు.
‘వుషాన్ గాడ్డెస్ ఎస్కలేటర్’ అని పిలిచే ఇందులో ఎనిమిది లిఫ్ట్‌లు, నాలుగు వాక్‌వేలు, పాదచారుల కోసం రెండు వంతెనలు, ఇరవై ఒక్క ఎస్కలేటర్లు ఉన్నాయి. ఈ ఎస్కలేటర్ సుమారు 800 అడుగుల ఎత్తుకు తీసుకెళుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది 80 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. ఈ ఎస్కలేటర్‌పై ప్రయాణం 21 నిమిషాల పాటు సాగుతుంది. ప్రతీరోజు 9వేల మంది ఈ ఎస్కలేటర్‌ను ఎక్కి పైకి చేరుతున్నారు. ఆకట్టుకునే నిర్మాణాలను చేపట్టడంలో, పర్యాటకులను ఆకర్షించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుందనడానికి ఇదొక తాజా ఉదాహరణ.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News