జాగ్రత్త.. పడవ ఎక్కే ముందు ఈ విషయాలు గుర్తించుకోండి
ABN , Publish Date - May 03 , 2026 | 01:01 PM
పర్యాటక ప్రాంతాల్లో పడవ ప్రయాణాల సమయంలో భద్రతా నియమాలను విస్మరించడం చాలా ప్రమాదకరం. కాబట్టి.. పడవ ఎక్కే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో బర్గి డ్యామ్ వద్ద జరిగిన క్రూయిజ్ పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. పర్యాటక ప్రాంతాల్లో చాలా సార్లు భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. అందుకే పడవ ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరం.
పడవ సామర్థ్యాన్ని గమనించండి
ప్రతి పడవకు అది మోయగల ప్రయాణికుల సంఖ్య, బరువు ముందే నిర్ణయించి ఉంటుంది. పడవలపై ఒక లేబుల్ లేదా తెల్లటి గీత ఉంటుంది. ఆ గీత నీటిలో మునిగిపోతే, పడవపై బరువు ఎక్కువైందని అర్థం. ఎక్కువ మంది ఎక్కితే పడవ అస్థిరంగా మారి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, పడవపై ఉన్న గుర్తులు లేదా లేబుల్స్‌ను చూసి మాత్రమే ఎక్కాలి.

వాతావరణాన్ని చెక్ చేయండి
పడవ ఎక్కే ముందు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నీటిపై ప్రయాణం పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. బలమైన గాలులు వీచినా, భారీ వర్షం పడినా పడవ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పడవలు అయితే మరింత ప్రమాదంలో పడతాయి. అందుకే ప్రయాణానికి ముందు వాతావరణం బాగుందా లేదా చూసుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉంటే లేదా వర్షం వచ్చే సూచనలు ఉంటే పడవ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.
లైఫ్ జాకెట్ తప్పనిసరి
పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీకు ఈత బాగా వచ్చినా కూడా లైఫ్ జాకెట్ ధరించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రమాద సమయంలో ఈత కొట్టడం కష్టమవుతుంది. లైఫ్ జాకెట్ ఉంటే మీరు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, లైఫ్ జాకెట్ సరిగ్గా వేసుకున్నామా లేదా అని కూడా తప్పక చెక్ చేసుకోవాలి.

స్థానిక నియమాలు
ప్రతి ప్రదేశంలో వేర్వేరు భద్రతా నియమాలు ఉంటాయి. లోతైన ప్రాంతాలు, నిషేధిత ప్రాంతాలు గురించి ముందే తెలుసుకోండి.
ఎమర్జెన్సీ ప్లాన్
పడవలో ఎక్కిన తర్వాత చుట్టూ ఒకసారి గమనించడం చాలా ముఖ్యం. రక్షణ కోసం ఉపయోగించే పరికరాలు, లైఫ్ బయ్స్, అదనపు లైఫ్ జాకెట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుంటే, ప్రమాద సమయంలో వెంటనే స్పందించగలుగుతారు.
సరైన సమయం
చీకటి సమయంలో పడవ ప్రయాణం చేయడం ప్రమాదకరం. ఉదయం లేదా పగలు సమయంలోనే ప్రయాణించడం సురక్షితం.

ప్రాథమిక చికిత్స
ఎవరైనా నీటిలో మునిగి బయటకు తీసిన తర్వాత స్పృహ కోల్పోతే, CPR వంటి ప్రాథమిక చికిత్స చేయగలిగితే ప్రాణాలు కాపాడవచ్చు. పడవ ప్రయాణం సరదాగా ఉంటుంది కానీ భద్రత చాలా ముఖ్యమైనది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News