వేసవిలో తరచూ కళ్లు తిరుగుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి!
ABN , Publish Date - May 02 , 2026 | 02:46 PM
ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సర్వసాధారణం. ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీని వల్ల కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల కళ్లు తిరుగుతాయి. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
1. వేసవిలో కళ్లు తిరగడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. ఎండ వల్ల శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దాహం వేయకపోయినా గంటకోసారి మంచినీళ్లు తాగాలి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే ORS, కొబ్బరి నీళ్లు, లేదా నిమ్మరసం తీసుకోవడం ఉత్తమం.
2. శరీరంలో సోడియం, పొటాషియం వంటి లవణాలు తగ్గడం వల్ల మెదడుకు అందే సంకేతాల్లో మార్పులు వచ్చి కళ్లు తిరుగుతాయి. మజ్జిగలో కాస్త ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. గ్లూకోజ్ వాటర్ కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
3. ఖాళీ కడుపుతో ఎండలో ప్రయాణించడం అస్సలు మంచిది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల కూడా కళ్లు తిరుగుతాయి. కర్బూజ, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. మసాలాలు, వేపుళ్లు తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి.
4. తీవ్రమైన ఎండలో నేరుగా తిరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి కళ్లు తిరుగుతాయి. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలు ధరించాలి. లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
5. కొందరికి ఎండ వేడికి రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. ఎండలో నడిచి వచ్చిన వెంటనే నీడలో విశ్రాంతి తీసుకోవాలి. కళ్లు తిరిగినట్లు అనిపిస్తే వెంటనే కూర్చుని లేదా పడుకుని కాళ్లను కాస్త ఎత్తులో ఉంచాలి.
కళ్లు తిరిగినప్పుడు చేయాల్సిన తక్షణ పనులు:
ముందుగా చల్లని నీడ ఉన్న ప్రదేశానికి వెళ్లాలి.
ఏదైనా స్థిరమైన ప్రదేశంలో కూర్చోవాలి లేదా పడుకోవాలి.
తల, మెడపై చల్లని నీటితో తుడుచుకోవాలి.
డీహైడ్రేషన్ వల్ల కళ్లు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కొద్దిగా నీరు, కొబ్బరి నీళ్లు వంటివి తాగాలి.
నిమ్మరసం నీరు కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
వాంతులు, స్పృహ కోల్పోవడం వంటివి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News