Share News

దేశదేశాల మామిడి పానీయాలు

ABN , Publish Date - May 03 , 2026 | 11:58 AM

మామిడి పండు దొరికినా కాయ దొరికినా కమ్మని పానీయంగా మార్చుకుని రసాస్వాదన చేసేందుకు అనేక ఉపాయాలున్నాయి. మనవాళ్లూ, విదేశీయులూ తయారుచేసుకునే కొన్ని మామిడి పానీయాలివి:

దేశదేశాల మామిడి పానీయాలు
Mango Drinks

మామిడి పండు దొరికినా కాయ దొరికినా కమ్మని పానీయంగా మార్చుకుని రసాస్వాదన చేసేందుకు అనేక ఉపాయాలున్నాయి. మనవాళ్లూ, విదేశీయులూ తయారుచేసుకునే కొన్ని మామిడి పానీయాలివి:

మామిడి రసం: మామిడి పండుని ముక్కలుగా కోసుకుని తినటం కన్నా పిండి రసం తీసుకుని తాగటమే మేలంటుంది క్షేమకుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథం.

మామిడి పానకం: మామిడి రసంలో తగినంత పంచదార, యాలకులపొడి, లవంగాల పొడి, అల్లం ముద్ద కలిపిన పానీయం ఇది. ‘‘ఇది తాగిన తరువాత ఆకలి పెరగకుండా ఎవరికుంటుందీ?’’ అంటాడు క్షేమశర్మ.

పుల్లమామిడి పానకం: బాగా కండపుష్టి కలిగిన మామిడికాయని తోలుతియ్యకుండా నీళ్లలో వేసి ఉడికించి, పిండి రసం తీసి, దానికి సమానంగా చిక్కని పాలు, పాలలో సగం నీళ్లు, చక్కెర, మిరియాలపొడి వేసి చిలికి, ఫ్రిజ్జులో పెట్టుకుని తాగుతారు.


మామిడిపండు లస్సీ: మామిడిపండు గానీ కాయగానీ లోపలి గుజ్జు తీసుకుని, మీగడ పెరుగు, చక్కెర, యాలకుల పొడి కలిపి బాగా చిలికిన చిక్కని పానీయం మామిడిపండు లస్సీ. శరీరాన్ని చల్లబరుస్తుంది, జీర్ణానికి మంచిది.

ఆమ్‌ పన్నా: పచ్చి మామిడి కాయ గుజ్జులో తగినంత చక్కెర లేదా బెల్లం, ఒక చెంచా వేగించిన జీలకర్ర, తగినంత నల్ల ఉప్పు యాలకులపొడి, మిరియాలపొడి చాట్‌ మసాలా వగైరా కలిపి, చల్లని మంచి నీరు పోసి చిలకాలి. చివరిలో పుదీనా ఆకులు వేసి ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా తాగితే వేసవిలో వడకొట్టకుండా ఉంటుంది.


మెక్సికో మామిడి పానకం: బాగా పండిన మామిడి పండు రసాన్ని పిండి సమానంగా చల్లని మంచినీటిని కలిపి తగినంత చక్కెర వేసి చిలుకుతారు. మెక్సికన్ల మామిడి పానకం ఇది.

మాంగోనాడా (చమోయాడా): మామిడి రసాన్ని చమోయి అనే సాస్‌ తో కలిపి చేస్తారు. డ్రై ఫ్రూట్స్‌, 1-2 పచ్చిమిరప కాయ ముక్కలు, కొద్దిగా చక్కెర, ఉప్పు, కావల్సిన మసాలా ద్రవ్యాలూ కలిపి ఈ చమేలీ సాస్‌ తయారు చేస్తారు. మామిడి రసాన్నీ ఈ, చమోయీ సాసునీ, ఒక నిమ్మకాయ రసం, కొద్దిగా చిల్లీసాస్‌, వీటిని తగుపాళ్లలో చేర్చి సమానంగా మంచినీళ్లు కలిపి బాగా చిలికి మాంగోనాడా చేస్తారు. మెక్సికోలో ఇది వీధి పానీయం.


book7.2.jpgథాయిలాండ్‌ ‘మామువాంగ్‌ నామ్‌ పానీయం: థాయ్‌ భాషలో మామువాంగ్‌ అంటే మామిడి రసం అని! తాజా మామిడి రసంలో చక్కెర సిరప్‌, ఐస్‌తో చేసే సాదా పానీయం. కొన్నిసార్లు కొబ్బరి పాలు కలుపుతారు, కానీ, తియ్యగా చేసిన చేపల సాసుని కలిపి కూడా ఈ మామువాంగ్‌ పానీయాన్ని తయారు చేస్తారు.

ఫిలిప్పీన్స్‌ మ్యాంగో షేక్‌: తియ్యని మామిడిరసంలో పాలు, చక్కెర చేర్చి చిలికి ఐస్‌ కలుపుకుని తాగుతారు.

పోర్చుగీసుల సుకో డి మాంగా: పోర్చుగీసు ఆంగ్ల నిఘంటువులో సుకో డి మాంగా అంటే మ్యాంగోజ్యూస్‌ అని అర్థం ఉంది. మామిడి పండు రసంలో పాలు పంచదార అవసర మైనంత చేర్చి చిలికిన పానీయం. ఇతర పండ్లరసాలను కూడా చేర్చి తయారు చేస్తారు.


వియత్నాం ‘సిన్‌ తో సోయ్‌’: వియత్నాం భాషలో సోయ్‌ అంటే మామిడి అనీ, సిన్‌తో అంటే బాగా చిలికి చేసిన షేక్‌ లేదా స్మూతీ అని అర్థాలున్నాయి. మామిడి గుజ్జు, కాచి చల్లార్చిన పాలు, చక్కెర, మీగడ వగైరా కలిపి ఈ స్మూతీని తయారు చేస్తారు.

అవకాడోతో మామిడి పానీయం: మామిడి గుజ్జుని అవకాడో గుజ్జుని వేర్వేరుగా తీసుకుని, ఒక పాత్రలో మొదట మామిడి గుజ్జుని ఒక పొరగా వెయ్యాలి దానిమీద అవకాడో గుజ్జుని పరవాలి. పైన మళ్లీ మామిడి దానిపైన మళ్లీ అవకాడో ఇలా రెండు గుజ్జుల్నీ పొరలుపొరలుగా పరవాలి. తీపి కావాలనుకుంటే ప్రతి పొర మీదా కొద్దిగా పంచదార పొడి చల్లుకోవచ్చు. ఇది ఇథియోపియన్ల పోషకాహారం.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

గృహాలంకరణలో ఎం‘జాయ్‌కోర్‌’

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2026 | 11:58 AM