Share News

స్కూలు డ్రాపవుట్‌...ఇప్పుడు టెక్‌ టాపర్‌...

ABN , Publish Date - May 03 , 2026 | 11:31 AM

పదహారేళ్ల వయసులోనే క్రిప్టో యాప్‌ తయారుచేసి, ‘టీనేజ్‌ కోడర్‌’గా చరిత్ర సృష్టించింది హర్షిత ఆరోరా! టెక్నాలజీ వేదికపై తనదైన ముద్ర వేసి యువ ఆంత్రప్రెన్యూర్‌గా సత్తా చాటుతోంది.

స్కూలు డ్రాపవుట్‌...ఇప్పుడు టెక్‌ టాపర్‌...
Harshita Arora

పదహారేళ్ల వయసులోనే క్రిప్టో యాప్‌ తయారుచేసి, ‘టీనేజ్‌ కోడర్‌’గా చరిత్ర సృష్టించింది హర్షిత ఆరోరా! టెక్నాలజీ వేదికపై తనదైన ముద్ర వేసి యువ ఆంత్రప్రెన్యూర్‌గా సత్తా చాటుతోంది. అయితే ఆమె 8వ తరగతిలో స్కూల్‌ డ్రాపవుట్‌ అంటే నమ్ముతారా? 13 ఏళ్లకే కోడింగ్‌లో తొలి అడుగులు వేసింది. భవితకు తనే కోడ్‌ రాసుకుని... టెక్‌ రంగంలో దూసుకువెళ్తున్న హర్షిత కెరీర్‌ గ్రాఫ్‌... ఆద్యంతం ఆసక్తికరం!

ఇంటర్నెట్‌ ప్రపంచం ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. సరిగ్గా వాటిని గుర్తించి సాహసోపేతంగా ముందడుగేసింది హర్షిత. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌నకు చెందిన ఆమెకు చిన్నప్పటి నుంచీ టెక్నాలజీపై ఆసక్తి. తండ్రి స్టాక్‌ బ్రోకర్‌, తల్లి గృహిణి. ఆటపాటలతో గడిపే వయసులోనే కంప్యూటర్‌ స్ర్కీన్‌ ముందు గంటల తరబడి కూర్చునేది. యూట్యూబ్‌ వీడియోలు, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌, కోడింగ్‌ ఫోరమ్స్‌ సాయంతో తనకు తానే ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం ఆరంభించింది. స్విఫ్ట్‌, ఐఓఎస్‌ డెవలప్‌మెంట్‌ వంటి టెక్నాలజీ నేర్చుకుంది. చిన్నచిన్న ప్రాజెక్టులతో మొదలుపెట్టి, క్రమంగా పెద్ద యాప్‌లు తయారుచేసే స్థాయికి చేరుకుంది.


ప్రధానమంత్రి పురస్కారం

హర్షిత తన 16వ ఏట బెంగళూర్‌లో సేల్స్‌ఫోర్స్‌ ఇంటర్న్‌షిప్‌ చేసింది. అమెరికాలోని ఎంఐటీలో నాలుగు వారాల ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌ ప్రోగ్రామ్‌కు హాజరైంది. 2019లో శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లి, ‘ఏటూబీ’ అనే స్టార్టప్‌ను స్థాపించింది. సాంకేతిక రంగంలో యంగ్‌ అచీవర్స్‌కు లభించే ‘ప్రధానమంత్రి రాష్ర్ట్రీయ బాలశక్తి పురస్కార్‌’ను 2020లో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా స్వీకరించింది.

హర్షిత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది ‘క్రిప్టో ప్రైస్‌ ట్రాకర్‌’ యాప్‌. క్రిప్టో కరెన్సీ, ప్రోగ్రామింగ్‌లపై చేసిన పరిశోధన ఫలితమిది. మార్కెట్‌ ట్రెండ్‌కు సరిపడే సొల్యూషన్‌ ఇది. దీనిద్వారా వివిధ క్రిప్టో కరెన్సీల ధరలను ట్రాక్‌ చేయొచ్చు. రియల్‌టైమ్‌ అప్‌డేట్లు పొందొచ్చు. స్కామర్ల నుంచి మదుపరులను సురక్షితంగా ఉంచే ఈ యాప్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యధిక డౌన్‌లోడ్లతో అద్భుత ఆదరణ పొందింది. అత్యుత్తమ సాంకేతిక ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ స్కాలర్‌షిప్‌’ ఆమెకు చిన్న వయసులోనే లభించింది. 2023లో ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాకు ఎంపికైంది. సమస్యలను గుర్తించడం, టెక్నాలజీతో పరిష్కారం ఆలోచించడం, ఆ పరిష్కారాన్ని యాప్‌గా రూపకల్పన చేయడం... ఈ మూడు దశలూ ఆమెను సాధారణ విద్యార్థిని నుంచి ఒక ఇన్నోవేటర్‌గా మార్చాయి.


book6.4.jpgమెంటార్‌గా...

ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల స్టార్టప్‌ యాక్సిలరేటర్‌... ‘వై కాంబినేటర్‌’ (వైసీ). ఇది టెక్‌ అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం, నిధులను అందిస్తుంది. ఇందులో 19 ఏళ్ల వయసులో విజిటింగ్‌ పార్ట్ట్‌నర్‌గా చేరిన హర్షిత ప్రస్తుతం పాతికేళ్ల వయసులో ఫుల్‌టైమ్‌ రోల్‌లో యంగెస్ట్‌ ‘జనరల్‌ పార్ట్‌నర్‌’ అయ్యింది. ‘వైసీ’లో ఆమె తొలి దశ ఫౌండర్స్‌కు మెంటార్‌గా చేస్తోంది. స్టార్టప్‌ సంస్థల విలువను అంచనా కడుతోంది. ఓ భారతీయ యువతి గ్లోబల్‌ స్టార్టప్స్‌నూ, వెంచర్‌ కాపిటల్‌నూ మలిచే కీలక స్థాయికి ఎదగడం చెప్పుకోదగ్గ విశేషం. ‘‘ఇదంతా నేనేమీ ప్లాన్‌ చేసుకున్నది కాదు. అసలు వైసీలో విజిటింగ్‌ పార్ట్‌నర్‌ అవ్వాలనే నేను కోరుకోలేదు. సంస్థ సంప్రదించినపుడు సరదాగా ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాతి ప్రాజెక్టుకు ఇన్‌స్పిరేషన్‌ పొందొచ్చు అనుకున్నా. అలా 2025 వరకూ మూడు బ్యాచ్‌లకు విజిటింగ్‌ పార్ట్‌నర్‌గా చేశా. ఈ అనుభవం నా దృక్పథాన్ని మార్చేసింది. దరఖాస్తులూ, ఈవెంట్లూ, కంపెనీలకు మద్దతు లాంటి సంస్థ కీలక కార్యకలాపాలతో అనుబంధం పెంచుకున్నాను’’ అంటోందామె.


book6.3.jpgవినూత్న పంథాలో సాగిన హర్షిత కెరీర్‌, ఆమె విజయాలు యంగ్‌ టెకీలూ, ఔత్సాహిక వ్యవస్థాపకులకు స్ఫూర్తినిచ్చేవే. అయితే ‘‘ప్రణాళిక లేకుండా సాగిన నా మార్గం అనుసరిస్తే... అది అందరికీ వర్కవుట్‌ కాకపోవచ్చు. దీనిలో విజయానికి గ్యారంటీ లేదు’’ అని ఆమె స్పష్టం చేస్తోంది. వ్యవస్థీకృత విద్యాభ్యాసం ద్వారా లభించే క్రమబద్ధమైన శిక్షణ కొందరికి లభించకపోవచ్చు. అంతమాత్రాన వెనకబడి వుండాల్సివస్తుందని నిరాశ చెందనక్కర్లేదు. ఆసక్తి, సడలని పట్టుదలతో ‘సెల్ఫ్‌ లెర్నింగ్‌’ ద్వారా నేటి డిజిటల్‌ యుగంలో ఎంతో సాధించొచ్చు. హర్షిత దీన్నే రుజువు చేస్తోంది. ఈ డిజిటల్‌ యుగంలో సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని చక్కని అవకాశాలు సృష్టించాలని కోరుకునే యువతరానికి ఆమె ఎదుగు దల తిరుగులేని ప్రేరణ!


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

గృహాలంకరణలో ఎం‘జాయ్‌కోర్‌’

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2026 | 11:31 AM