Share News

గృహాలంకరణలో ఎం‘జాయ్‌కోర్‌’

ABN , Publish Date - May 03 , 2026 | 08:31 AM

రంగులు వెలసిన బోసి గోడలు, కర్టెన్లు... లేత రంగుల సోఫా కవర్లు, దీవాన్‌... ఇంట్లోకి అడుగుపెట్టగానే బోర్‌డమ్‌గా ఫీలవుతున్నారా? అయితే వీటన్నింటినీ తక్షణమే మార్చేయండి.

గృహాలంకరణలో ఎం‘జాయ్‌కోర్‌’
Home Decorating

రంగులు వెలసిన బోసి గోడలు, కర్టెన్లు... లేత రంగుల సోఫా కవర్లు, దీవాన్‌... ఇంట్లోకి అడుగుపెట్టగానే బోర్‌డమ్‌గా ఫీలవుతున్నారా? అయితే వీటన్నింటినీ తక్షణమే మార్చేయండి. జీవితం అంటేనే జాయ్‌ఫుల్‌! ‘ఉన్న ఒక్క జిందగీని రంగులమయంగా మార్చుకుందామ’ని అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. కొంత కాలం క్రితం దాకా ఇంటి అలంకరణలో ఎక్కడ చూసినా మినిమలిజం ఊసులే. ఇప్పుడిక కలర్‌ఫుల్‌ ‘జాయ్‌కోర్‌’ జపం చేస్తోంది. అదెలా ఉంటుందంటే...

ఇంటికి చేరుకోగానే ఆఫీసు ఒత్తిళ్లన్నీ మాయమై, సంతోషం ఉప్పొంగాలి. కోల్డ్‌ కాఫీ తాగుతూ, నచ్చిన సంగీతం వింటూ ఆనందమయ సాయంత్రాలు గడపాలి. అయితే ఆఫీసు పని ఒత్తిడిలో, ట్రాఫిక్‌ వలయాల్లో అలాంటివి ఆశించడం కాస్త కష్టమే అనేవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. విచిత్రం ఏమిటంటే... సంతోషం ఎక్కడో కాదు, మనసులోనే ఉంటుంది. రోజులో ఎక్కువగా గడిపే ఇంటిలోపలే ఉంటుంది. అందుకే మనసును ఉత్తేజపరిచేలా ఇంటి వాతావరణాన్ని తీర్చిదిద్దుకోవాలి అంటున్నారు డిజైనర్లు. ఇంటికి చిన్నపాటి మేకోవర్‌ ఇస్తే... అదే ‘జాయ్‌కోర్‌’ డెకరేటింగ్‌ స్టయిల్‌. ఈ ఏడాది (2026)కి డెకొరేటింగ్‌ స్ట్టయిల్‌గా ‘జాయ్‌కోర్‌’ను హోమ్‌ ఫర్నీచర్‌ దిగ్గజ సంస్థ ‘ఐకియా’ ప్రకటించింది.


స్వర్గసీమ

‘ఆ వాలు కుర్చీలో కూర్చుంటే...’, ‘పెరట్లో చెట్ల కింద ఊయల ఊగుతుంటే..’, ‘నక్షత్రాలను లెక్కిస్తూ మేడ మీద ఆరుబయట మేను వాల్చితే ...’ ఇలా చాలామంది ఇంట్లో తమకు నచ్చిన ప్రదేశాల గురించి చెబుతుంటారు. ‘అయితే అదే సంతోషం ఇళ్లంతా పరచుకొనేలా ఎందుకు ట్రై చేయకూడద’ని అంటారు హోమ్‌డెకార్‌ పండితులు. ప్రస్తుతం సంతోషం (జాయ్‌) అనేది ట్రెండింగ్‌లో ఉంది. వార్షిక ‘ఇంటీరియర్‌ డిజైనర్‌ ట్రెండ్స్‌’ సర్వేలో మాక్సిమలిజమ్‌కు 39 శాతం, మిశ్రమవాదానికి 38 శాతం ఓట్లు పడ్డాయట. ఇంటీరియర్స్‌ని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న తపన సహజంగానే బాగా పెరిగింది. దానికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ‘ఇల్లే కదా స్వర్గసీమ’ అంటున్నారు.


book3.2.jpgసరిగ్గా ఇక్కడే ‘జాయ్‌కోర్‌’ ముందడుగు వేస్తోంది. కళ్లని కట్టిపడేసే గాఢమైన రంగులు, వస్తువులు, వివిధ ప్రింట్ల కుషన్లు, సోఫాలతో ఇంటిని అలంకరించడమే జాయ్‌కోర్‌ డెకరేషన్‌ స్టయిల్‌. వీటన్నింటి వల్ల సహజంగానే చిరాకు పోయి, ఆనందం కలుగుతుంది. హాల్లో గోడలకు వేలాడదీసిన అనేక రకాల ఆకృతుల ఫ్రేమ్‌లు, గాఢమైన రంగుల తివాచీ, దీవాన్‌, సోఫా కవర్లు, షెల్ఫ్‌లలో వివిధ రంగుల కుండీలు, రంగులమయంగా ఉండే వంట సామగ్రి... ఇంకా విభిన్నమైన దీపాలు, ఫ్లవర్‌ వాజ్‌లు ... ఇలా ఇంటిని రంగులమయంగా మార్చేయవచ్చు. ఇది కేవలం హాలుకో, సిటౌట్‌కో పరిమితం కాదు... కిచెన్‌, బెడ్‌రూమ్‌లలో కూడా రంగుల మిశ్రమం బాగా వర్కవుట్‌ అవుతుంది.


అంచెలంచెలుగా...

‘ఓహ్‌ ఇంతేనా...’ అనిపిస్తుంది కానీ ఇంటిని ‘జాయ్‌కోర్‌’ డెకార్‌లో అలంకరించడం అంత సులభమేమీ కాదు. మొదటి నుంచీ తెలుపు, లేత రంగులకు అలవాటు పడిన మనస్తత్వం ఆ రంగులు, వింతైన వస్తువులను ఒప్పుకోదు. ఇల్లంతా కంగాళీగా మారుతుందని భయమేస్తుంది.అయితే, కొత్తను స్వీకరించడం ఎప్పుడూ సవాలే. అందుకే ఒకేసారి ఇల్లంతా కాకుండా... ఒక్కో గదిని కొద్ది కొద్దిగా మార్చుకోవాలి. నచ్చితే ‘జాయ్‌కోర్‌’ డెకార్‌ను కంటిన్యూ చేయొచ్చు.


book3.3.jpgఏం చేయాలి?

ముందుగా ఏవైనా రెండు ప్రధాన రంగుల్ని ఎంచుకోవాలి. ఈ రెండిటినీ సమం చేసేలా ఓ తటస్థ రంగు ఎంచుకుంటే సరి. గోడలు, కర్టెన్లు, సోఫా, దీవాన్‌, తివాచీలను ఆయా రంగులతో సెట్‌ చేసి చూడండి. వీటిలో మళ్లీ పూలు, తరంగాలు, శిల్పాలు, అద్దాలు, జంతువులు ... ఇలా వివిధ రకాల డిజైన్లవి ఎంపిక చేసుకోవాలి. అలాగే గోడల మీద ఫ్రేమ్‌లు... బెడ్‌, సోఫాల్లోని దిండ్లు కూడా. వీటన్నింటితో ఒక్కసారిగా గది లుక్కే మారిపోతుంది. గదితో పాటు జీవితమూ వైబ్రెంట్‌గా మారుతుంది. ఈ రంగులు మెదడులో పాజిటివ్‌ ఎమోషన్స్‌ను ప్రేరేపిస్తాయి. చాలామంది తమ ఇళ్లల్లో ఈ మార్పులు చేస్తూ ‘రీడింగ్‌ ప్రదేశాలు’, ‘లిజనింగ్‌ ప్రదేశాలు’ అని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటున్నారట.


‘జాయ్‌కోర్‌’ డెకార్‌ కేవలం రంగులకు సంబంధించినదే కాదండోయ్‌... అనుభూతుల్ని అందించే ఆకృతులు, అద్దాలు, ఆకారాలు కూడా ఇందులో భాగమే. ఒంపు తిరిగిన దీపాలు, అలల్లాంటి ఫోటో ఫ్రేమ్‌లు, విచిత్రంగా ఉండే పూల కుండీలు, బుట్టలు... ఇలా వీటన్నింటినీ గది అలంకరణలో భాగం చేసుకోవాలి. ఈ చిన్న చిన్న మార్పులు చేస్తూ ఇంటికి కొత్తదనాన్ని తీసుకురావచ్చు. సోఫా పక్కనే విభిన్నమైన దీపాలను అలంకరించడం. పెద్ద బుట్టల పక్కనే చిన్న వస్తువులు ఉంచడం, రంగురంగుల సిరామిక్‌ ఫ్లవర్‌వాజ్‌లను టేబుల్‌ మీద ఏర్పాటుచేయడం వల్ల పరిసరాలు వైబ్రెంట్‌గా మారిపోతాయి. వీటన్నింటి వల్ల ఇల్లంటే నాలుగు గోడలు, రెండు కిటికీలు అని కాకుండా... ప్రతీ ఒక్కరికీ అనుభూతుల కథలను అందిస్తాయి. ఇంట్లోని ప్రతీ అలంకరణ వెనకా మీ ఓపిక, అభిరుచి, భావోద్వేగాలను పట్టిస్తాయి. ఒక్కో వస్తువునీ ఎంత ప్రేమతో ఆలోచించి, అలంకరించారో చూసేవారికి అర్థం అవుతుంది. కాస్త కష్టం అనిపించినా ఈ ప్రయత్నం తప్పకుండా తెలియని సంతోషాల్ని కలిగిస్తుంది. ఆ మాయాజాలం ‘జాయ్‌కోర్‌’ డెకార్‌దే అని కచ్చితంగా చెబుతారు కూడా.


book3.4.jpgఇలా చేయండి

‘జాయ్‌కోర్‌’ డెకార్‌లో పర్‌ఫెక్షన్‌ అనేది ఉండదు. ఇదో ఫీలింగ్‌. ఇష్టమైన అలంకరణలతో ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు.

  • మెత్తటి కుషన్లు, రంగురంగుల పెయింటింగ్‌లతో గది లుక్‌ను మార్చవచ్చు.

  • ప్రకాశవంతమైన తివాచీ లేదా సిల్క్‌ కర్టెన్లతో బెడ్‌రూమ్‌లో హంగామా సృష్టించొచ్చు.

  • పాత కుర్చీ ఉన్నచోట కొత్త ఫ్లవర్‌ వాజ్‌ను జోడించి విభిన్నంగా చేయొచ్చు.

  • రంగుల కుండీలు, టేబుల్‌ లైౖట్లతో మెరుపులు తేవచ్చు.


మనసుపై రంగుల ప్రభావం

నివసించే ప్రదేశాల ప్రభావం మనసు మీద పడుతుందని ‘న్యూరోసైన్స్‌’ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందుకే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా, మనసుకు ప్రశాంతత చేకూర్చే అంశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఎలాంటి రంగుల వల్ల ఆనందం కలుగుతోంది? ఆందోళనలు తగ్గుతున్నాయి? ఎక్కడ కూర్చుంటే ప్రశాంతత చేకూరుతుంది? దానికి కారణం ఏమిటో తెలుసుకుని ఇళ్లంతా అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. మెత్తని సోఫాలు, దిండ్లు, దుప్పట్లు, పరుపుల వల్ల ఆందోళనలు తగ్గుతాయి. అలాగే మానసిక స్థితులని బ్యాలెన్స్‌ చేయగల శక్తి రంగులకు ఉందని ఈ ‘కలర్‌ సైకాలజీ’ తెలియజేస్తోంది. అందుకే తాజాగా ఎం‘జాయ్‌కోర్‌’ అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ఆస్తులు కొంటున్నారా..ఇవి చెక్‌ చేసుకోండి!

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2026 | 08:59 AM