ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' సైనిక దాడులు చేస్తాం: ట్రంప్ హెచ్చరిక
ABN , Publish Date - May 03 , 2026 | 06:53 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తాజాగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు చేస్తే, ఆ దేశంపై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
వాషింగ్టన్ DC, మే 3: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు చేస్తే, ఆ దేశంపై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నప్పటికీ సైనిక చర్య అనే ఆప్షన్ ఇంకా పక్కకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై దాడుల గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, 'ఒకవేళ వారు తప్పుగా ప్రవర్తిస్తే, కచ్చితంగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం' అని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద మిగిలి ఉన్న దాదాపు 15 శాతం క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కూడా తుడిచిపెట్టాలని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 85 శాతం ఇరాన్ సామర్థ్యం ధ్వంసమైందని ఆయన చెప్పుకొచ్చారు.
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలపై ట్రంప్ పెదవి విరిచారు. 'వారు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ అది నాకు సంతృప్తికరంగా లేదు. గత 47 ఏళ్లుగా ప్రపంచానికి వారు చేసిన దానికి ఇంకా సరైన మూల్యం చెల్లించలేదు' అని ట్రూత్ సోషల్ వేదికగా కూడా విమర్శించారు. ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం ముక్కలైపోయిందని, అక్కడ రెండు మూడు బృందాలు వేర్వేరుగా వ్యవహరిస్తున్నాయని, అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇరాన్ ఇటీవల పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఒక 14 అంశాల శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నియంత్రించేలా అమెరికా మరికొన్ని సవరణలను కోరుతోంది. చర్చలు సాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య సయోధ్య ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో, అటు ఇరాన్ కూడా తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, అయితే దౌత్యమార్గంలో సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే