Share News

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

ABN , Publish Date - May 02 , 2026 | 03:54 PM

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రుబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది.

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే
DK Shivakumar

గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రుబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar)ను రంగంలోకి దింపింది. ఆయనతో పాటు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు ముందే పార్టీ అభ్యర్థులను కలుసుకునేందుకు అసోం చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల బారిన పడకుండా వారిని కాపాడుకునేందుకు ఇక్కడకు వచ్చినట్టు గువాహటిలో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ డీకే చెప్పారు.


'మా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇక్కడకు వచ్చాను. ఎమ్మెల్యేలకు మార్గదర్శకం చేసి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాను. ఎమ్మెల్యేలను కాపాడుకుంటాం' అని డీకే శివకుమార్ చెప్పారు. ఫిరాయింపుల నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు 'హోటల్ పాలిటిక్స్' నడపడంలో డీకే సమర్థుడనే పేరుంది.


'ఇండియా' కూటమిదే ప్రభుత్వం

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నా, లేకున్నా వాటిని తాను నమ్మనని, తన అంచనాలు తనకు ఉన్నాయని చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ 'ఇండియా' కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని పార్టీ కార్యకర్తలు కూడా ధీమాగా ఉన్నారని చెప్పారు. పార్టీ నాయకులపైన, అస్సాం ఓటర్లపైనా తనకు నమ్మకం ఉందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది సాకారం అవుతుందని చెప్పారు. కాగా, రాష్ట్ర నాయకత్వం, పార్టీ అభ్యర్థులతో తాను, డీకే శివకుమార్ ఈరోజు సమావేశమవుతున్నట్టు భూపేష్ బఘేల్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి కాపీ-పేస్ట్ వ్యవహారమని, ఎన్నడూ నిజం కావని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..

అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే వరుసగా మూడోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 126 సీట్లలో ఎన్డీయే 88 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు 24-36 సీట్లు వస్తాయని 'యాక్సిస్ మై ఇండియా' జోస్యం చెప్పింది. ఎన్డీయేకు 88-101 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 23-33 సీట్లు సాధిస్తుందని 'జేవీసీ' తెలిపింది. బీజేపీ కూటమి 85-95 సీట్లు, కాంగ్రెస్ 25-32 సీట్లు గెలుచుకుంటాయని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. పీ-మార్క్ సైతం బీజేపీ కూటమి 82-94 సీట్లు గెలుచుకుంటుదని, కాంగ్రెస్‌కు 30-40 సీట్లు వస్తాయని చెప్పింది. ఆరు పార్టీల కూటమిగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో పోటీపడింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

Updated Date - May 02 , 2026 | 05:00 PM