Share News

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

ABN , Publish Date - May 02 , 2026 | 02:55 PM

ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చారిత్రకం కానున్నట్టు తెలిపింది.

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
TVK Vijay

చెన్నై: ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చారిత్రకం కానున్నట్టు తెలిపింది.


టీవీకే ఎగ్జిక్యూటివ్ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగోట్టియన్ శనివారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమిళనాడులో ఏ పార్టీ మెజారిటీ సాధించకపోవడం అనే పరిస్థితి ఉండదని, టీవీకే 180 నుంచి 200 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే, ఎన్డీయేతో పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ 'విజనరీ పాలన' అందించనున్నట్టు చెప్పారు. విజయ్ అనేక అవాంతారాలను ఎదుర్కొని ముందుకు ప్రయాణం సాగించారని, ఇందుకు తగిన ఫలితం మే 4న వస్తుందని అన్నారు.


ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే తిరిగి అధికారంలోకి రానుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. విజయ్ పార్టీ లాభపడుతుందని, అయితే భారీ విజయం సాధించే అవకాశం లేదని తేల్చిచెప్పాయి. రెండు ఎగ్జిట్ పోల్స్... యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య మాత్రం తమిళనాడులో కింగ్‌మేకర్‌గా టీవీకే నిలుస్తుందని జోస్యం చెప్పాయి. 98 నుంచి 120 నియోజకవర్గాల్లో టీవీకే గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. 63 సీట్ల వరకూ టీవీకే గెలవచ్చని టుడేస్ చాణక్య తెలిపింది. అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే తమిళనాడులో అధికారంలోకి రాదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 85 శాతం పోలింగ్ నమోదైంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


ఇవి కూడా చదవండి..

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..

Updated Date - May 02 , 2026 | 03:18 PM