Share News

ఆస్తులు కొంటున్నారా..ఇవి చెక్‌ చేసుకోండి!

ABN , Publish Date - May 03 , 2026 | 03:52 AM

చేతిలో నాలుగు రాళ్లు ఉంటే ప్రతి ఒక్కరూ ముందుగా ఏదో ఆస్తి సమకూర్చుకోవాలని అనుకుంటారు. అది భూములు కావచ్చు లేదా ఇల్లు కావచ్చు.

ఆస్తులు కొంటున్నారా..ఇవి చెక్‌ చేసుకోండి!

చేతిలో నాలుగు రాళ్లు ఉంటే ప్రతి ఒక్కరూ ముందుగా ఏదో ఆస్తి సమకూర్చుకోవాలని అనుకుంటారు. అది భూములు కావచ్చు లేదా ఇల్లు కావచ్చు. అయితే వీటిని కొనే ముందే ఆ ఆస్తికి సంబంధించిన యాజమాన్య హక్కులు, దాన్ని నిరూపించే డాక్యుమెంట్లను పూర్తిగా చెక్‌ చేసుకోవాలి. లేకపోతే కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మాయమాటలతో ఒకే ఆస్తిని ఇద్దరు, ముగ్గురికి అంటగడుతున్న ఈ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్తులు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్లను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. అవేమిటంటే..

టైటిల్‌, యాజమాన్య పత్రాలు: ఈ పత్రాలు మీరు కొనబోయే ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? చట్టబద్దంగా దాని యజమాని ఎవరు? వివాదాలు లేకుండా ఆ ఆస్తిని ఇతరులకు బదిలీ చేయవచ్చా? అనే విషయాలు తెలుస్తాయి. ఆస్తి కొనుగోలుదారుడితో పాటు ఆ ఆస్తి కొనుగోలుకు రుణాలు ఇచ్చే బ్యాంకులు కూడా తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్లను చెక్‌ చేసుకోవాలి. ఇందుకోసం ప్రాపర్టీ అంశాలపై గట్టి పట్టు ఉన్న లాయర్‌ సేవలు తీసుకుంటే మరింత మంచిది.

సేల్‌ డీడ్‌: ఈ డాక్యుమెంట్‌ ద్వారా మీరు కొనబోయే ఆస్తి.. ప్రస్తుత అమ్మకందారుడికి ఎలా వచ్చిందనే విషయం తెలుస్తుంది. ఇందులో ఈ ఆస్తి అమ్మకందారుడికి కొనుగోలు, గిఫ్ట్‌గా లేదా వారసత్వం ఈ మూడింటిలో ఎలా వచ్చిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ : ఈ సర్టిఫికెట్‌ ద్వారా మీరు కొనబోయే ఆస్తిపై తీసుకున్న రుణాల చరిత్ర, తనఖా వివరాలు, న్యాయపరమైన వివాదాల చరిత్ర తెలుస్తుంది. కొనబోయే ఆస్తి ఉన్న ప్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి 13 నుంచి 30 సంవత్సరాల కాలానికి ఈ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడం మంచిది. దీనివల్ల మీరు కొనే ఆస్తి గతంలో ఎవరెవరి పేరు మీద ఉంది? ఎప్పుడెప్పుడు చేతులు మారింది? అనే విషయాలు తెలుస్తాయి.


మదర్‌ డీడ్‌ : దీని ద్వారా మీరు కొనబోయే ఆస్తి లేదా భూమి తొలి యజమాని ఎవరో తెలుసుకోవచ్చు.

మ్యుటేషన్‌/ల్యాండ్‌ రికార్డులు: ఈ రికార్డులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాల్లో లభిస్తాయి. వీటి ద్వారా మీరు కొనబోయే ఆస్తి తాజా యాజమాన్య వివరాలు తెలుసుకోవచ్చు.

ఖాతా/మునిసిపల్‌ రికార్డులు: స్థానిక తహసీల్దార్‌ లేదా మునిసిపల్‌ అధికారుల వద్ద ఈ రికార్డులు లభిస్తాయి. వీటి ద్వారా కూడా ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకోవచ్చు.

పవర్‌ ఆఫ్‌ అటార్నీ: పవర్‌ ఆఫ్‌ అటార్నీ (పీఓఏ) ద్వారా అమ్మకానికి పెడితే ఈ పత్రాన్ని మరింత జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. ఆస్తి యజమాని నిజంగానే ఆ వ్యక్తికి తన ఆస్తి అమ్మకం కోసం పీఓఏ ఇచ్చాడా? ఇస్తే దానిపై సంతకాలు అసలు యజమానివేనా? అని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి. ఇక్కడ ఆస్తి యజమాని బతికి ఉంటే అతడు రాసిన ఆఖరి పీఓఏ మాత్రమే కోర్టుల్లో చెల్లుబాటవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్టర్డ్‌ పీఓఏ ఉంటే మరింత భద్రత ఉంటుంది.


ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ : ఇల్లు లేదా ఫ్లాట్‌ కొంటుంటే స్థానిక సంస్థల నుంచి దాని నిర్మాణం పూర్తయి, నివాసానికి అనుగుణంగా ఉన్నట్టు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇస్తారు. బిల్డర్‌ లేదా ఆ ఇల్లు, ఫ్లాట్‌ అమ్మే యజమాని నుంచి ఈ సర్టిఫికెట్‌ కాపీ తీసుకుని తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి.

ల్యాండ్‌ అండ్‌ ప్రాపర్టీ యూజ్‌ అప్రూవల్స్‌ : మీరు కొనే ఇల్లు లేదా ప్రాపర్టీ యాజమాన్య హక్కు పత్రం ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని నిర్మించిన భూమి, ప్రాపర్టీకి అవసరమైన ల్యాండ్‌ యూజ్‌, కన్వర్షన్‌, లే అవుట్‌, బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతులు ఉన్నాయో లేవో కూడా చెక్‌ చేసుకోవాలి.

కన్‌స్ట్రక్షన్‌ , పొసెషన్‌ సర్టిఫికెట్లు: ఈ సర్టిఫికెట్ల ద్వారా మీరు కొనే ఇల్లు లేదా ఫ్లాట్‌ అనుమతులకు లోబడే నిర్మించారా? డీవియేషన్లు ఏమైనా ఉన్నాయా? ఆ ఇల్లు లేదా ఫ్లాట్‌ నివాస యోగ్యమేనా అనే విషయాలు తెలుస్తాయి.

రెగ్యులేటరీ, ప్రాజెక్టు స్థాయి అనుమతులు: మీరు కొనే ఇల్లు లేదా ఫ్లాట్‌ ఉన్న వెంచర్‌ రెరా రిజిస్ట్రేషన్‌, స్థానిక సంస్థల అనుమతులు, అగ్నిమాపక, నీటి సరఫరా వంటి శాఖల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) వివరాలు కూడా చెక్‌ చేసుకోవాలి.

ఆర్థిక, బకాయిల పత్రాలు: ఇప్పటికే వేరొకరి యాజమాన్యంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్‌ కొంటుంటే చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ రసీదులు, విద్యుత్‌, వాటర్‌ బిల్లులు చెక్‌ చేసుకోవాలి. అలాగే హోమ్‌ లోన్‌లో ఉన్న ఇల్లయితే ఆ రుణం పూర్తిగా చెల్లించినట్టు రుణం ఇచ్చిన బ్యాంకు జారీ చేసిన ఎన్‌ఓసీ చెక్‌ చేసుకోవాలి. హౌసింగ్‌ సొసైటీ నుంచి కూడా నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి.

ఎప్పుడెప్పుడు ఏయే డాక్యుమెంట్‌ చెక్‌ చేయాలి?

  • బయానా ఇచ్చే ముందు ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్‌, ఎన్‌కంబరెన్స్‌ డాక్యుమెంట్‌ చెక్‌ చేసుకోవాలి.

  • గృహ రుణానికి దరఖాస్తు చేసే ముందు ల్యాండ్‌ యూజ్‌, బిల్డింగ్‌ అప్రూవల్స్‌, రెగ్యులేటరీ అనుమతులు చెక్‌ చేసుకోవాలి.

  • రిజిస్ట్రేషన్‌, తుది చెల్లింపులకు ముందు ఆర్థిక బకాయిలు, లోన్‌ క్లోజర్‌, పొసెషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు, తుది ఒప్పందం షరతులు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి.

Updated Date - May 03 , 2026 | 03:52 AM