Share News

ఇసుకతిన్నెలపై అక్షరాల ఓనమాలు.. మహిళలు దిద్దుతున్న సంతకాలు

ABN , Publish Date - Sep 14 , 2026 | 08:50 AM

ఆమెకు చదువంటే ప్రాణం. కానీ పేదరికం కారణంగా చిన్నప్పటి నుంచి బడికి వెళ్లలేదు. అయినా చదువుపైన ఇష్టాన్ని వదులుకోలేదు. శ్రద్ధగా ప్రతి అక్షరాన్నీ నేర్చుకున్నారు. సంతకం పెట్టడం తెలుసుకున్నారు. ఇప్పుడు అదే విద్యను ఇతరులకూ పంచుతున్నారు.

ఇసుకతిన్నెలపై అక్షరాల ఓనమాలు.. మహిళలు దిద్దుతున్న సంతకాలు
Malo Devi

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని బక్రౌర్ గ్రామంలోని కొందరు మహిళలకు ఒక గురువు దొరికారు. ఎప్పుడూ బడికి వెళ్లని ఆ గురువు సొంతంగా అక్షరాలు నేర్చుకుని, అక్కడి స్త్రీలకు నేర్పిస్తున్నారు. మాలో దేవి అనే ఓ మహిళకు సంబంధించిన ఈ కథనం పూర్తి వివరాల్లోకెళితే...


చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ చిన్నప్పుడు కడు పేదరికం వల్ల మాలో దేవి చదువుకు దూరమయ్యారు. ఆమె నివాసానికి సమీపంలోనే పాఠశాల ఉన్నా ఆర్థిక కారణాలతో వెళ్లలేకపోయారు. అయినా ఆమె విద్యపై ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. మెల్లమెల్లగా అక్షరాలు నేర్చుకుంటూ వచ్చారు. సంతకం పెట్టడం కూడా తెలుసుకున్నారు. తాను నేర్చుకున్నది తనకే పరిమితం కాకుండా నలుగురితో పంచుకోవడం మేలనుకున్నారు. అంతే.. ఆ గ్రామంలోని మహిళలకు విద్యా బోధన చేయడం మొదలుపెట్టారు.

wr.jpg


ప్రస్తుతం బ్రకౌర్‌లోని మహిళలందరూ ఓ రావి చెట్టు కిందకు చేరుతున్నారు. అక్కడ తమ గురువు వద్ద.. హిందీ అక్షరాలు, ఇంగ్లీష్ లెటర్స్ నేర్చుకుంటున్నారు. రోజువారీ పనులు ముగించుకుని పుస్తకాలతో చెట్టు నీడ కింద గుమిగూడుతున్నారు. అక్షరాలు పూర్తిగా వచ్చాక.. సంతకాలు పెట్టడం కూడా నేర్చుకుంటున్నారు. బాగా గుర్తుండాలని మాలో దేవి అక్షరాలు ఇసుకపైన రాసి చూపిస్తారు. ఆ మహిళలు వాటిని చేతివేళ్లతో దిద్దుతుంటారు. దాదాపు 50 మంది మహిళలు ఇప్పటిదాకా సంతకాలు నేర్చుకున్నారని మాలో దేవి చెబుతున్నారు. కనీసం రాయడం, చదవడం వస్తే ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదని, అందుకే వారికి రోజూ అక్షరాలు నేర్పిస్తున్నానని అంటున్నారు. అయితే అటు ప్రభుత్వం సహాయం, ఇటు సేవా సంస్థల ప్రోత్సాహం.. ఈ రెండూ లేకుండానే ఆమె క్లాసులు నిర్వహిస్తున్నారు.

sand.jpg


మాలో దేవి దగ్గర నేర్చుకున్న చదువు.. ఆ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నిత్యం బ్యాంక్ పనుల కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు తమ పనులను తామే చక్కబెట్టుకుంటున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కైలియా దేవి అనే 45 ఏళ్ల మహిళ.. తనకు సంతకం పెట్టడం వచ్చని, ఇప్పుడు కొన్ని ఆంగ్ల అక్షరాలను కూడా గుర్తుపట్టగలనని సగర్వంగా చెబుతున్నారు. మరికొందరు మహిళలు రాయడం నేర్చుకున్నాక తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరిస్తున్నారు.

అక్కడి మహిళలతో పాటు 200 మంది చిన్నారులకు కూడా మాలో దేవి విద్యాబుద్ధులు నేర్పారు. అలాగే తాను పొందలేకపోయిన చదువును తన సంతానమైనా పొందాలని భావించి వారిని డిగ్రీ దాకా చదివించారు.

rw.jpg


ఇవి కూడా చదవండి:

ఎన్‌డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 14 , 2026 | 10:50 AM