ఎన్‌డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:12 AM
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ)ను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు
వచ్చే ఎన్నికలకు ముందే అమల్లోకి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి
ముంబయి, సెప్టెంబరు 13: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ)ను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు జరిగే 2029కి ముందే దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, 25 ఏళ్ల కాలంలో బీజేపీ సాధించిన విజయాలను ఆదివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు. ముమ్మారు తలాక్‌ను నిషేధించి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కలిగించామని, కొన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు చేస్తున్నామని చెప్పారు. అన్ని ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేస్తామని చెప్పారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స) ద్వారా దేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ బలోపేతమయిందని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఏడాది కాలంలో పరిష్కరించిన కేసుల సంఖ్య 30 శాతం మేర పెరిగిందని చెప్పారు. మూడేళ్ల కాల వ్యవధిలో న్యాయం లభించే పరిస్థితి ఉందని తెలిపారు. దేశ భద్రతపై అమిత్ షా మాట్లాడుతూ బొట్టు రక్తం కారకుండా, ఒక్క తూటా కూడా పేలకుండా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370, 35ఏ అధికరణాలు రద్దయ్యాయని చెప్పారు. కశ్మీర్ ఇప్పుడు దేశంలో సంపూర్ణంగా భాగమయిందని అన్నారు. 50 దశాబ్దాల చరిత్ర ఉన్న నక్సలిజం అంతమయిందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 14 శాంతి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో 9,000 మంది లొంగిపోయారని, ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందని వివరించారు. .
మణిపూర్‌లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) అమలుకు 1951వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా అని ప్రశ్నించగా దీనిపై పార్టీలతో చర్చిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్, సర్జికల్ స్ట్రయిక్‌ల ద్వారా ఉగ్రవాదాన్ని సహించేదిలేదన్న గట్టి సందేశాన్ని పంపించామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదార్లపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ వారిని పట్టుకున్న విధానాన్ని బహిర్గతపరచమంటారా అని ఎదురు ప్రశ్న వేశారు. ఆ వివరాలు తెలిస్తే వారు జాగ్రత్త పడుతారు కదా అని చమత్కరించారు. ప్రతి ఒక్క చొరబాటుదురుడ్ని కూడా గుర్తించి తిప్పి పంపిస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల నివారణకు నిషా ముక్త్ భారత్ కార్యక్రమం కింద అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్
కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ అధ్యక్షుడు