Share News

‘లావణీ’... గెలవాలని...

ABN , Publish Date - Jul 05 , 2026 | 10:59 AM

స్టేజీ మీద కొందరు నర్తిస్తున్నారు. ప్రేక్షకులు ఉత్సాహంగా లేరు. పైగా ‘ఈథాబాయి కావాలి... ఈథాబాయి కావాలి...’ అంటూ కేకలు పెడుతూ ఒకటే గోల. నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోలేదు.

‘లావణీ’... గెలవాలని...

స్టేజీ మీద కొందరు నర్తిస్తున్నారు. ప్రేక్షకులు ఉత్సాహంగా లేరు. పైగా ‘ఈథాబాయి కావాలి... ఈథాబాయి కావాలి...’ అంటూ కేకలు పెడుతూ ఒకటే గోల. నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోలేదు. అదే సమయానికి స్టేజీ వెనుక నిండు గర్భంతో ఈథా బాయి నొప్పులు పడుతోంది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... స్టేజీ ముందు ప్రేక్షకుల గోల ఎక్కువయ్యింది. ఆ గోల ఈథాబాయి వింటూనే ఉంది. ఒక్క క్షణం ఆలోచించి... పసిబిడ్డ బొడ్డు తాడును తెంపి, మరికొన్ని నిమిషాల్లో ఆమె స్టేజీపై ప్రత్యక్షమయ్యింది. స్టేజీపై ఈథాబాయిని చూసిన ప్రేక్షకుల్లో హుషారు. వారి చప్పట్లు, ఈలలు, గోల నడుమ ఆమె డ్యాన్స్‌ మొదలయ్యింది. పురిటినొప్పులు పంటి బిగువున దాచి, ఆమె చేసిన ‘లావణీ’... నిజంగానే లా జవాబ్‌... ఇంతకీ ఎవరీ ఈథాబాయి...

జూలై 1, 1933.. అంటే సరిగ్గా 93 ఏళ్ల కిత్రం... మహారాష్ట్రలోని పండపూర్‌ (సోలాపూర్‌ జిల్లా)లో పుట్టింది ఈథాబాయి (సినిమా పేరు) అనే విఠాబాయి బావు నారయణ్‌ గావంకర్‌. ఎవరి బాల్యమైనా తోటి పిల్లలతో ఆటపాటల మధ్య సరదాగా మొదల వుతుంది. అయితే విఠాబాయి బాల్యం మాత్రం జానపదకళలతో మొదలైంది. ఎందుకంటే... ఆమె తాత నారాయణ్‌ కుడే జానపద కళాకారుడు. ‘తమాషా’ ట్రూప్‌ని స్థాపించాడు.


‘తమాషా’ అనేది మహారాష్ట్రకు చెందిన ఒక సంప్రదాయ జానపద కళారూపం. నాటకం, సంగీతం, నృత్యాల మేళవింపు. ఇందులో ‘లావణీ’ ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రక్రియలో శృంగారం, ప్రేమ, కాస్త వ్యంగ్యం కథలా సాగుతాయి. ఈ ప్రదర్శనల మధ్యనే విఠాబాయి బాల్యమంతా గడిచింది. తాత మరణించాక తండ్రి బావు బాపు నారాయణ్‌ గావంకర్‌ ‘తమాషా’ పగ్గాలు చేపట్టాడు. తండ్రితో పాటు విఠాబాయి ఊరూరా తిరిగేది. చదువుకునే తీరికెక్కడిది? అయితే స్టేజీ మీద కళాకారుల హావభావాలు, ప్రేక్షుకుల మనోభావాలను బాగా చదివింది విఠాబాయి.


  • టర్నింగ్‌ పాయింట్‌...

ఒకరోజు విఠాబాయి స్టేజీ మీద డ్యాన్స్‌ చేస్తోంది. అక్కడే ఉన్న ప్రముఖ మరాఠీ నాటక రచయిత మామా వారర్కర్‌ ఆమెను చూశాడు. తన బృందంతో కలిసి పని చేయమని ఆహ్వానించాడు. అప్పటిదాకా ఆమెకు డ్యాన్స్‌ మాత్రమే వచ్చేది. దానికి నాటకరంగ శిక్షణ తోడయ్యింది. ఆ అనుభవం ఆమెకు ప్రదర్శన మెలకువలు నేర్చుకోడానికి సహాయపడింది. ఆ తర్వాత ‘తమాషా’కు సరికొత్త వన్నెలద్ది, మహారాష్ట్ర జానపద కళారంగంలో ఒక వెలుగు వెలిగింది. ‘తమాషా సామ్రాజి’్ఞగా మారింది.


  • సినిమాను కాదని...

ఢోలక్‌ మోగగానే, గజ్జెల సవ్వడి దానికి అనుగుణంగా ఒక కథను చెబుతుంది. అప్పుడది నృత్యం కాదు... నృత్యరూపకం. లావణీలోని జానపద సౌందర్యం, హావభావాలు, హుషారు అందరికీ నచ్చుతుంది. స్టేజీ మీద విఠాబాయిని చూడటానికి జనం ఎగబడేవారు. దాంతో మహారాష్ట్రలో ఆమె తిరుగులేని నృత్యకారిణిగా మారింది. అదే సమయంలో ఆమెకు సినిమా ఆఫర్‌లు కూడా వచ్చాయి. ఏకంగా లెజండరీ నటుడు రాజ్‌కపూర్‌ ఆమెను సినిమాల్లోకి ఆహ్వానించారు. అయితే కళనే నమ్ముకున్న విఠాబాయి సినిమా ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. ఈ జానపద కళను, దానినే నమ్ముకున్న తోటి కళాకారులను బతికించాలని కంకణం కట్టుకుంది. తన కెరీర్‌ తమాషాతోనే ముగించాలనుకుంది.


  • కష్టాల కడలి...

ముఖంపై చెరుగని చిరునవ్వుతో, స్టేజీపై హుషారుగా నృత్యం చేసే ఆమె తెరవెనుక జీవితంలో ఎంతో విషాదముంది. తండ్రి చనిపోయిన తర్వాత ఆమెకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తండ్రి లేని లోటును అతడు తీరుస్తాడనుకుంది. పెళ్లయిన తర్వాత కానీ ఆ మానవమృగం తీరు బోధపడలేదు. విఠాబాయి సంపాదనంతా తనకే ఇవ్వాలన్నాడు. అందుకోసం రాక్షసుడిలా ప్రవర్తించేవాడు. అయినా జీవితకాలం భరించింది. కానీ ఆ బాధలను ఎప్పుడూ స్టేజీ మీదకు మాత్రం తీసుకురాలేదు. కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని, స్టేజీపై మాత్రం ఆమె కొండలపై నుంచి దూకుతున్న జలపాతమయ్యేది. ప్రేక్షకులను ఉర్రూతలూగించేది.


కొన్ని దశాబ్దాల పాటు అద్భుతమైన లావణీ నృత్యకారిణిగా పేరుగాంచిన విఠాబాయి చివరి రోజుల్లో ఆర్థికంగా చితికిపోయి, పక్షవాతం బారిన పడింది. 2002 జనవరి 15న కన్నుమూసింది. విషాదం ఏమిటంటే... అంతటి మహా కళాకారిణి అంత్యక్రియల కోసం కుటుంబం దగ్గర అణాపైసా లేని పరిస్థితి. విఠాబాయి అభిమానులు, సాంస్కృతిక సంస్థలే ఆమెను ఈ లోకం నుంచి గౌరవప్రదంగా సాగనంపారు. అలా ఒక జానపద కళా సామ్రాజ్ఞి కథ ముగిసింది. ఆ జానపద నృత్యకారిణి జీవితం ఇన్నేళ్లకు తెరకెక్కుతోంది. అదే ‘ఈథా’. నిజ జీవితంలో విఠాబాయి... తెర మీద ‘ఈథాబాయి’.


తెర మీద ‘ఈథా’బాయి

book5.2.jpgకీర్తి, త్యాగం, పోరాటంతో నిండిన జీవితం విఠాబాయిది. మరాఠా జానపద కళ తమాషా, లావణీ కళాకారిణిగా ప్రసిద్ధి చెందిన ఆమె కథ ఆధారంగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ (‘చావా’ దర్శకుడు) దర్శకత్వంలో ‘ఈథా’గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విఠాబాయిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా గూగుల్‌లో విఠాబాయి గురించి సెర్చ్‌ చేస్తున్నారంతా.


రాష్ట్రపతి పురస్కారాలు...

విఠాబాయి మహారాష్ట్రకే పరిమితం కాలేదు. ఇతర దేశాల్లో కూడా లావణీ, తమాషా నృత్య ప్రదర్శనలిచ్చింది. తమాషా జానపద కళకు ఆమె చేసిన సేవలకుగాను 1957లో, 1990లో రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. భారత సైనికుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 2006 మహారాష్ట్ర ప్రభుత్వం విఠాబాయి గౌరవార్థం సాఫల్య పురస్కారాలను అందిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

షారుక్‌ నా ఫస్ట్‌ క్రష్‌

బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 10:59 AM