అరుదైన పక్షి..
ABN , Publish Date - Jul 05 , 2026 | 10:28 AM
గతంలో ఉనికిలో లేని ఓ వింత పక్షిని అనుకోకుండా గమనించాడో పరిశోధక విద్యార్థి. జీవశాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించి, అధ్యయనానికి ప్రేరేపించిన ఆ పిట్ట పుట్టుకే ప్రత్యేకం.
గతంలో ఉనికిలో లేని ఓ వింత పక్షిని అనుకోకుండా గమనించాడో పరిశోధక విద్యార్థి. జీవశాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించి, అధ్యయనానికి ప్రేరేపించిన ఆ పిట్ట పుట్టుకే ప్రత్యేకం. దీనివెనక లక్షల ఏళ్ల చరిత్ర, ఆధునిక వాతావరణ మార్పుల ప్రభావమూ ఉండటం విశేషం!
ఆడపక్షి పేరు గ్రీన్ జే. మగపక్షి పేరు బ్లూ జే. ఇవి చాలా ఏళ్ల క్రితం పరిణామ క్రమంలో వేర్వేరు ప్రాంతాలకు వలస పోయాయి. ఒకటేమో మధ్య అమెరికా లోని తేమతో కూడిన ఉష్ణమండల వాతా వరణాన్నీ, మరొకటి తూర్పు అమెరికాలోని సమశీతోష్ణ అడవులనూ ఎంచుకున్నాయి. ఆ రకంగా అవి మరెప్పటికీ కలుసుకునే వీలు లేకుండా.. ఒకదానికొకటి దూరమైపోయాయి.
కాలచక్రం తిరిగింది. భూతాపం పెరిగింది. పర్యావరణంలో పెను మార్పులు ఆ పక్షుల వలస విధానాలను మార్చేశాయి. ఈ వేర్వేరు పక్షుల సంతానపు కొత్త తరం పరస్పరం తారసపడ్డాయి. జతకట్టి ఓ సరికొత్త రకం పక్షికి జన్మనిచ్చాయి. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో ఉన్న టెక్సస్‌లోని శాన్‌ఆంటోనియోలో ఆ హైబ్రిడ్ వింత మగపక్షి కనపడింది. ఒక మగ బ్లూ జే, ఆడ గ్రీన్ జేల అరుదైన కలయికతో జన్మించిన పక్షి అది. ఈ రెండు పక్షి జాతులు ఎప్పుడూ ఒకే ప్రదేశంలో కలిసి జీవించలేదు.
అయితే గడిచిన దశాబ్దాల్లో ఉష్ణోగ్రత పెచ్చుమీరడంతో ఉష్ణ మండల గ్రీన్ జేలు మరింత ఉత్తరానికీ, సమశీతోష్ణ బ్లూ జేలు మరింత పశ్చిమానికీ విస్తరించాయి. ఈ కారణంగానే శాన్ ఆంటోనియో చుట్టుపక్కల ఆ రెండు జాతుల పక్షుల ఆవాసాలు ఒకదానితో ఒకటి కలిసి పోయిన సందర్భం లక్షల ఏళ్ల తర్వాత తటస్థపడింది. జన్యు పరీక్షల ద్వారా నిర్ధారించిన ఈ కొత్త గ్రీన్- బ్లూ జేనుప్రస్తుతానికి ‘గ్రూ జే’గా వ్యవహరిస్తున్నారు. మారుతున్న వాతావరణం కారణంగా ఆవిర్భవించిన కొత్త జాతికి తొలి ఉదాహరణగా దీన్ని భావిస్తున్నారు.
సోషల్‌మీడియా చూస్తూ...
బ్రయాన్ స్టోక్స్... యు.ఎస్. ఆస్టిన్‌లోని టెక్సస్ విశ్వవిద్యాలయంలో జీవావరణం, పరిణామం, ప్రవర్తన విభాగంలో పరిశోధక విద్యార్థి. ఓ రోజు అతడికి సోషల్‌మీడియాలో ఓ నీలిరంగు పిట్ట కనిపించింది. టెక్సస్‌లోని శాన్ ఆంటోనియో నగరానికి ఈశాన్యంగా ఉన్న శివారు ప్రాంతంలో తెల్లటి ఛాతీ, నల్లటి ముసుగుతో చూడటానికి బ్లూ జేను తలపిస్తూ భిన్నంగా ఉంది. ఆసక్తితో ఆ ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించి, ఆమె ఇంటికి వెళ్లి పెరట్లో ఆ పక్షిని ప్రత్యక్షంగా చూశాడు.
దాన్ని పట్టుకోవడం సులువు కాలేదు. మరుసటి రోజు సన్నని నైలాన్ జాలీతో చేసిన పొగమంచు వల వేస్తే.. అందులో చిక్కింది. దాన్ని జాగ్ర త్తగా పట్టుకుని, రక్త నమూనా సేకరించాడు. అది అప్పటిదాకా ఉనికిలో లేని, సహజ సంకరజాతి పక్షి అని విశ్లేషణలో తేలింది. అదొక అరుదైన ఆవిష్కరణ అని గ్రహించాడు. ‘‘వాతావరణ మార్పుల కారణంగా రెండు జాతులు పాక్షికంగానైనా తమ ఆవాసాలను విస్తరించుకున్నాయి. దీనివల్ల సంకరీకరణకు గురైన మొదటి వెన్నెముక గల ప్రాణి (సకశేరుకం) ఇదేనని భావిస్తున్నాం’’ అని స్టోక్స్ వివరించాడు.
1970లో గ్రీన్ జే, బ్లూ జే పక్షులను సంకరం చేసి ఓ జీవిని సృష్టించారు పరిశోధకులు. వాటి సంతానం ఇప్పుడు ఫోర్ట్‌వర్త్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ హిస్టరీలో డాక్సిడెర్మిక్ పద్ధతిలో భద్రపరిచిన నమూనాగా ఉంది. ఇది స్టోక్స్ ఇటీవల కనుగొన్న సహజసిద్ధ హైబ్రిడ్ పక్షిని పోలి వుండటం విశేషం.
వాతావరణ మార్పులు గతంలో ధ్రువపు ఎలుగుబంట్ల సంచార పరిధిని మార్చాయని పరిశోధకులు గుర్తించారు. కానీ హైబ్రిడ్ పక్షి విషయంలో... రెండు జాతుల నివాస ప్రాంతాలూ వేడెక్కడం వల్ల మారాయి. పట్టణీకరణ, అభివృద్ధి కారణంగా ఆవాసాలు కోల్పోవడం కూడా ఈ పిట్టల కదలికపై ప్రభావంచూపింది.
ఆశ్చర్యకరమైన నిజాలు...
బ్లూ జే, గ్రీన్ జేల మధ్య పరిణామక్రమంలో 70 లక్షల ఏళ్ల అంతరం ఉంది. మానవులు, చింపాజీలూ విడిపోయిన కాలానికి ఇది సమానం.
వాతావరణ మార్పుల వల్ల జీవుల ఆవాసాలు విస్తరించి, గతంలో ఎన్నడూ కలవని జాతులు ఇలా కలిసిపోవడానికి ఇది ప్రధాన ఉదాహరణ.
ఈ పక్షికి తండ్రి పోలికగా ప్రకాశవంతమైన నీలిరంగు ఈకలూ, తల్లి పోలికగా ముఖంపై నల్లటి మచ్చలూ, ప్రత్యేకమైన కూతలూ వచ్చాయి.
హైబ్రిడ్ పక్షికి అధికారికంగా పేరు ఇంకా పెట్టలేదు. ప్రకృతిలోని అత్యంత ఆశ్చర్యపరిచే సంకర జీవుల జాబితాలో ఇది స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో ఇప్పటికే ‘పిజ్లీ’ (పోలార్ బేర్- గ్రిజ్లీ బేర్), ‘కోయ్‌ఉల్ఫ్’ (కోయోట్ - ఉల్ఫ్) లాంటివి ఉన్నాయి. భూవాతావరణం ప్రకృతి సరిహద్దులను తిరిగి నిర్ణయిస్తున్నకొద్దీ జీవరాశుల పరంగా అనూహ్య పొత్తులు ఏర్పడతాయేమో!
భవిష్యత్తులోనూ పెరుగుతాయా?
ప్రస్తుతం ఈ హైబ్రిడ్‌కు చెందిన ఒక్క పక్షి మాత్రమే నమోదయింది. మొదట 2023లో కనిపించి 2025లో మళ్లీ కనిపించింది. మొదటిసారి దొరికినప్పుడు కాలికి కట్టిన ట్యాగ్ వల్ల దీన్ని మళ్లీ పోల్చుకున్నారు. అందువల్ల ఆ పక్షి బతికే ఉందని నిర్ధారణ అయింది. అయితే మరిన్ని సహజ సంకర పక్షులు ఉన్నాయా? అవి సంతానం ఉత్పత్తి చేయగలవా? ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ బ్లూ గ్రీన్ జే ఒక అరుదైన పక్షి మాత్రమే కాదు. వాతావరణ మార్పులు జీవుల స్థావరాలనూ, మనుగడనూ ఎలా మార్చేస్తున్నాయో చూపించే సజీవ ఉదాహరణ. లక్షల ఏళ్లుగా వేర్వేరుగా బతికిన రెండు పక్షి జాతులు ఇప్పుడు ఒకే ప్రాంతంలో కలుసుకుని కొత్త సంతానం సృష్టించడం అసాధారణం. దీనిని ప్రకృతి పంపిన హెచ్చరికగా భావించొచ్చు. పర్యావరణ మార్పులు తీవ్రమైతే భవిష్యత్తులో ఇలాంటి కొత్త తరహా జీవుల ఆవిర్భావం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News