బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:02 AM
అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసిన వాళ్లు.. ఆ కానుకలను కరిగించి బంగారం బిస్కట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది.
అయోధ్య విరాళాల స్కాం నిందితుల దారుణాలు.. సిట్ దర్యాప్తులో వెల్లడి
ఓ ఇంగ్లిష్ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు
న్యూఢిల్లీ, జూలై 4: అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసిన వాళ్లు.. ఆ కానుకలను కరిగించి బంగారం బిస్కట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. కానుకలకు సంబంధించిన ఏ ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతోనే నిందితులు ఇలా చేశారని ఈ అంశంపై ఏర్పాటైన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) భావిస్తోంది. అయోధ్య రామాలయానికి భక్తులు భారీ ఎత్తున సమర్పించిన బంగారం, వెండి కానుకల గురించి ఆరా తీస్తున్న సిట్.. ఆ కానుకల జాడ కనిపించకపోవటంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే.. విరాళాల దొంగలు బంగారు కానుకలను కరిగించి బిస్కట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. దీనిపై వివరాల కోసం, ఆలయం ఇంఛార్జిగా ఉన్న కేడీ బాబును సిట్ అధికారులు ప్రశ్నించారు. విలువైన కానుకలకు సంబంధించిన రికార్డులను తమకు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. విరాళాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు గత కొన్ని నెలలుగా జరిపిన ఆర్థిక లావాదేవీలను సిట్ పరిశీలిస్తోంది. నిందితులు భూములు, ఇండ్ల కొనుగోళ్ల వంటివి ఏమైనా చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
200 మందితో నెట్‌వర్క్
విరాళాల కుంభకోణం నేపథ్యంలో ఆంగ్ల చానల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన చంపత్‌రాయ్‌తోపాటు కర్ణాటకకు చెందిన గోపాల్‌రావు అనే వ్యక్తి ఈ స్కాంలో కీలకపాత్ర పోషించాడని ఓ వ్యక్తి ఈ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు. దాదాపు 200 మందితో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన గోపాల్‌రావు.. భక్తులు సమర్పించే కానుకలను తస్కరింపజేసి, కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ కరిగించేవాడని తెలిపారు. విరాళాల స్కాంలో భాగస్వాములైన వాళ్లకు నెలనెలా కమిషన్లు ముట్టేవన్నారు. మరోవైపు, ముంబైకి చెందిన ఓ భక్తుడు చలికాలంలో ఆలయ సిబ్బంది కోసం రెండు ట్రక్కుల నిండా స్వెట్టర్లను పంపిస్తే.. ట్రస్టు సీనియర్ సభ్యుడు అనిల్‌మిశ్రా వాటిలోంచి కేవలం 40 స్వెటర్లను మాత్రమే సిబ్బందికి ఇచ్చి మిగిలిన వాటిని మార్కెట్‌లో అమ్ముకున్నాడని తెలిసింది. స్కాం నేపథ్యంలో రాజీనామా చేసిన చంపత్‌రాయ్.. ఇప్పటికీ కీలకంగానే వ్యవహరిస్తున్నారని, అంతర్గత సమావేశాలు జరుపుతున్నారని వెల్లడైంది. బంగారు కానుకలు సమర్పిస్తున్న భక్తుల నుంచి.. ఆ కానుకల వినియోగంపై తమకు ఎలాంటి హక్కు ఉండబోదన్న హామీపత్రాన్ని ట్రస్టు అధికారులు తీసుకుంటున్నారని తెలిసింది.

రికార్డులిస్తే ప్రాణాలకే ముప్పు: కేంద్రం
రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను అందించాలని సమాచారహక్కు చట్టం ప్రకారం దాఖలైన ఓ దరఖాస్తును కేంద్ర హోంశాఖ తిరస్కరించినట్లు తాజాగా వెల్లడైంది. ట్రస్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని.. దాని ఆర్థిక, నిర్వహణ వ్యవహరాల్లో కేంద్రంగానీ, యూపీ ప్రభుత్వంగానీ జోక్యం చేసుకోవని హోంశాఖ తెలిపింది. దరఖాస్తుదారు కోరిన సమాచారంలో ఉన్న సున్నితమైన అంశాల కారణంగా దానిని బయటపెట్టలేమని పేర్కొంది. ఆ సమాచారాన్ని వెల్లడిస్తే.. సంబంధిత వ్యక్తుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బద్రీనాథుడి కానుకలూ చోరీ..?
అయోధ్య రామాలయంలో కానుకల దోపిడీ రగడ చల్లారకముందే హిమాలయాల్లో కొలువైన చారిత్రక బద్రీనాథ్ ఆలయంలోనూ దొంగలు పడ్డారని ఆరోపణలు గుప్పుమన్నాయి. స్వయంగా ఆలయ ట్రస్టు చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శే కానుకలు దొంగిలించాడని ఫిర్యాదులు వచ్చాయి. బద్రీనాథ్ ఆలయాన్ని బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) నిర్వహిస్తోంది. బీకేటీసీ పరిధిలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలతోపాటు మొత్తం 47 ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం బీకేటీసీకి హేమంత్ ద్వివేదీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఒక బీకేటీసీ ఉద్యోగి బద్రీనాథ్ ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు, డబ్బు కాజేశారని భైరవ్ సేన సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. కానుకల చోరీపై దర్యాప్తు జరిపించాలని బీకేటీసీ సీఈవో సోహన్‌సింగ్ రంగడ్‌కు లేఖ రాసింది. కానుకల చోరీ ఆరోపణలపై హేమంత్ ద్వివేదీ శనివారం స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని, అతడు బీకేటీసీ ఉద్యోగి అని చెప్పారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత చార్‌ధామ్ యాత్ర సందర్భంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు భక్తులు రూ.70 కోట్ల విలువైన కానుకలు సమర్పించారని వెల్లడించారు.