ఈ వృక్షాలు... చరిత్రకు సాక్ష్యాలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 09:11 AM
ఈ భూమ్మీద కోటానుకోట్ల వృక్షాలుంటాయి. అయితే కొన్నింటి వెనక ఆసక్తికరమైన కథలుంటాయి.
ఈ భూమ్మీద కోటానుకోట్ల వృక్షాలుంటాయి. అయితే కొన్నింటి వెనక ఆసక్తికరమైన కథలుంటాయి. మరికొన్ని వృక్షాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి... స్ఫూర్తినిస్తాయి. అలాంటి చెట్లను గుర్తించడం కోసం ఏటా యూరప్‌లో ‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ద ఇయర్’ పేరుతో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆసక్తికర చారిత్రక నేపథ్యాలున్న కొన్ని చెట్ల చరిత్ర ఇది...
ప్రజాస్వామ్యానికి ప్రతీక
స్వేచ్ఛ, స్వాతంత్ర్యోద్యమాలతో ఒక చెట్టు ముడిపడి ఉండటం చెక్ రిపబ్లిక్‌లో కనిపిస్తుంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా, జాతీయ గౌరవానికి చిహ్నంగా ‘లైమ్ ట్రీ ఆఫ్ లిబర్టీ’ని గుర్తించారు. చెక్ రిపబ్లిక్‌లో దేశవ్యాప్తంగా అనేక లైమ్ ట్రీలు (లిండెన్) ఉన్నాయి. 1918లో చెకొస్లోవేకియా దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో మొదటి ప్రపంచయుద్ధం ముగియడం, చెకొస్లోవేకియా ఏర్పడటంతో వెల్కె ఒపాటొవిస్‌లోని ప్రజలు ఆనందంతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి చిహ్నాలుగా 16 లైమ్ మొక్కలను నాటారు. యుద్ధంలో పాల్గొని తిరిగి వచ్చిన జాన్ పాస్‌పోసిల్ అనే వ్యక్తితో వాటిని నాటించారు.
వాటిలో రోడ్డు మధ్యలో, ఐదు రోడ్ల కూడలిలో ఉన్న ఒక్క చెట్టు మాత్రమే సజీవంగా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు సమావేశాలు జరుపుకొన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా లైమ్ చెట్ల నీడలోనే చేసేవారు. చెక్ జానపద గేయాలు, కళలలో ఈ చెట్టు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కొన్ని గ్రామాల్లో లైమ్ చెట్లను నాటేటప్పుడు చెట్టు వేర్ల దగ్గర చిన్న పెట్టెల్లో సందేశాలు, నాణేలు, ఆ కాలం వార్తాపత్రికలు పెట్టేవారట. భవిష్యత్ తరాలు వాటిని చూసి పూర్వీకుల స్వేచ్ఛ, ఆనందాన్ని గుర్తు చేసుకోవాలని అలా చేసేవారు. ఇప్పటికీ ప్రతీ ఏటా స్థానికులు లైమ్ వృక్షాల వద్ద కార్యక్రమాలు నిర్వహించి, గతాన్ని స్మరించుకుంటారు.
పోరాటాలకు వేదికగా...
కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్యుబెక్ లిండెన్ చెట్టు క్రొయేషియాలోని గాంజా స్టుబికా గ్రామంలో ఉంది. క్రొయేషియాలో జరిగిన ఎన్నో సంఘటనలకు ఇది సజీవ సాక్ష్యంగా నిలిచింది. 1573లో జమీందారుల దౌర్జన్యాలు, పన్నులకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుకు మటిజా గ్యుబెక్ నాయకత్వం వహించారు. ఆయన పిలుపుతో వందలాది మంది రైతులు తరలివచ్చారు. వాళ్లంతా ఈ చెట్టు కిందే కూర్చుని కార్యాచరణ చేశారని స్థానికులు చెబుతారు. రైతుల కోసం పోరాడిన మటిజా గ్యుబెక్‌ను అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. రైతుల తిరుగుబాటుకు సజీవసాక్షిగా నిలిచిన ఈ చెట్టును స్థానికులు స్వేచ్ఛ, పోరాటానికి ప్రతీకగా భావిస్తారు. తరువాత కాలంలో ఈ వృక్షాన్ని జాతీయ ప్రకృతి స్మారక చిహ్నంగా గుర్తించారు. ఇది ‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ద ఇయర్ 2019’ పోటీలలో క్రోయేషియా నుంచి అధికారికంగా నామినేట్ అయింది.
ప్రేమకు సాక్షిగా...
ఇంగ్లాండ్‌లోని అబర్‌ఫోర్డ్ గ్రామ సమీపంలో ఉన్న ఈ చెట్టును స్థానికులు ‘లవ్ ట్రీ’ అంటారు. సుమారు వందేళ్ల క్రితం విక్ స్టెడ్ అనే యువకుడు తన ప్రేయసి నెల్లీని కలుసుకునేందుకు రోజూ నడిచి వెళ్లేవాడు. ఆ మార్గంలో ఒకచోట మూడు బీచ్ చెట్లున్నాయి. రోజూ వాటిని గమనిస్తున్న స్టెడ్ ప్రేయసి నెల్లీతో తన ప్రేమను వ్యక్తం చేయడం కోసం మధ్యలో ఉన్న చెట్టును, పక్క చెట్టుతో అంటు కట్టి ఆంగ్ల అక్షరం ‘ఎన్’ ఆకారంలో పెరిగేలా చేశాడు. అది నెల్లీకి చాలా నచ్చింది. తరువాత కొద్ది రోజులకు నెల్లీ, విక్ పెళ్లి చేసుకున్నారు. ఆ చెట్టు ప్రేమకు చిహ్నంగా నిలవడంతో స్థానికులు లవ్ ట్రీగా పిలవడం ప్రారంభించారు. క్రమక్రమంగా పెళ్లి ప్రపోజల్స్‌కు ఆ చెట్టు వేదికయ్యింది. 2018లో బ్రిటిష్ ట్రీ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది.
పక్షి కాదు... చెట్టే!
దూరం నుంచి చూస్తే విప్పుకున్న రెక్కలతో ఎగరడానికి సిద్ధంగా ఉన్న పక్షిలా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది చెట్టు కాండం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రకృతి సృష్టించిన ఈ చెట్టు ఫ్రాన్స్‌లోని కోర్సికా ద్వీపంలోని గిసోనాసియా ప్రాంతంలో ఉంది. స్థానికులు ఈ చెట్టును ‘బర్డ్ ట్రీ’ అని పిలుస్తుంటారు. కార్క్ ఓక్ జాతికి చెందిన ఈ చెట్టు రెండు వందల ఏళ్ల నాటిది. దీని కాండం చుట్టుకొలత 16 అడుగులు. యూరోపియన్ ట్రీ ఆఫ్ ది ఇయర్ - 2019 పోటీలలో ఫ్రెంచ్ ట్రీ ఆఫ్ ది ఇయర్‌గా నిలవడంతో ఒక్కసారిగా పాపులర్ అయింది. పిడుగు ప్రమాదం లేదా అగ్ని ప్రమాదం వల్ల కాండం దెబ్బతిని అలా అయి ఉంటుందని నిపుణులు అంటారు. అయితే చెట్టు రెండు వైపులా ఉన్న రెక్కలు దాదాపు ఒకే ఆకారంలో ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానికులు ఈ చెట్టును అడవికి కాపలాదారుడు అని పిలుస్తారు. చెట్టు రెక్కల కింద నిలబడితే రక్షణ పొందుతున్న భావన కలుగుతుందని అంటారు.
ఐక్యతకు ప్రతీక
అధికారులు తొలగించాలని చూస్తే ప్రజలంతా కలిసి అడ్డుకున్నారు. చివరకు ఆ చెట్టు వల్ల రొమేనియా దేశానికి గుర్తింపు లభించింది. రొమేనియాలోని కాంపెనీ పట్టణం సమీపంలోని అపుసేని పర్వతప్రాంతం లో ఉన్న ప్లేన్ చెట్టును అధికారులు నరికివేయాలని అనుకున్నారు. అయితే చెట్టు సమీపంలో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఆ చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అధికారులకు తేల్చి చేప్పారు గ్రామస్థులు. దాంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఆ తరువాత రొమేనియా శతాబ్ది ఉత్సవాల సమయంలో గౌరవార్థంగా ఆ చెట్టుకు ‘రొమేనియన్ ట్రీ ఆఫ్ ద ఇయర్’ బిరుదును ప్రదానం చేశారు. యూరప్‌లో అత్యంత స్ఫూర్తిదాయకమైన చెట్లలో ఇదొకటి.
తరగని స్ఫూర్తి
స్ఫూర్తినిచ్చే వ్యక్తుల గురించి వినే ఉంటారు. కానీ పోలండ్‌లోని క్రాస్నిస్టావ్‌లో ఒక చెట్టు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఈ చెట్టు పైకి ఎదగకుండా భూమిపై పాకుతున్నట్టుగా ఉండటంతో ఆకారం సరిగ్గా లేదని అధికారులు నరికివేయాలని నిర్ణయించారు. అయితే స్థానికులు వ్యతిరేకించారు. వారి పోరాటంతో నిలిచిన ఈ చెట్టు ఇప్పుడు దేశానికి గుర్తింపును తెచ్చింది. ఈ చెట్టు కాండం నేలవైపు వంగి, మోకరిల్లిన మనిషిలా ఉంటుంది. అందుకే ఈ చెట్టును ‘నీలింగ్ ట్రీ’ అని పిలుస్తారు. అలానే మోకరిల్లి ఉంటే ఆ చెట్టుకు ప్రత్యేక గుర్తింపు వచ్చేది కాదు. వంగిన చెట్టు మళ్లీ నిటారుగా పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చెట్టు ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా పోరాడాలనే సందేశాన్నిస్తుంది. ఈ చెట్టును సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.
అన్ని కార్యక్రమాలు అక్కడే...
నాలుగు శతాబ్దాలుగా ఆ ఊరి ప్రజల జీవితాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది ఎల్మ్ చెట్టు. స్పెయిన్‌లోని నవాజాస్ గ్రామ జనాభా వెయ్యిలోపే ఉంటుంది. వాళ్లందరూ చెట్లపై చెప్పలేని మమకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న ఎల్మ్ చెట్టుతో వారికి విడదీయలేని బంధం ఉంది. ఈ చెట్టును 1636లో పాస్టోర్ అనే వ్యక్తి నాటారు. ఆయన పేరును చెట్టు పక్కన ఏర్పాటు చేసిన శిలాఫలకంలో చూడొచ్చు. సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ఉత్సవాలు... ఇలా గ్రామంలో జరుపుకొనే కార్యక్రమం ఏదైనా ఈ ఎల్మ్‌చెట్టు కిందే జరుగుతుంది. గ్రామప్రజల ఐక్యతకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. చెట్టు 350వ జన్మదిన వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. చెట్టుపై ప్రత్యేక గీతాలు రాసి ఆలపించారు. ‘ఎల్మ్ ఆఫ్ నవాజాస్’గా పిలిచే ఈ చెట్టు స్పెయిన్ ట్రీ ఆఫ్ ద ఇయర్‌గానూ ఎంపికైంది.
రహస్యాల సంరక్షకురాలు
ఒక చెట్టు పూర్వీకుల కథలను, రహస్యాలను కాపాడుతోందా? అంటే అవుననే అంటారు స్లోవాక్ రిపబ్లిక్ దేశస్థులు. ఆ దేశంలోని కోప్ గ్రామ శివారులో ఉన్న లైమ్ చెట్టును ‘గార్డియన్ ఆఫ్ గ్రేట్ మొరావియా సీక్రెట్స్’ అని పిలుస్తారు. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు ఒక పురాతన చర్చి పక్కనే ఉంటుంది. చర్చి గ్రేట్ మొరావియా కాలం నాటిదని చెబుతారు. గ్రేట్ మొరావియా యూరప్‌లో ఉన్న తొలి స్లావిక్ రాజ్యాలలో ఒకటి. స్థానికుల కథనం ప్రకారం ఈ చెట్టు తన వేర్లతో గ్రేట్ మొరావియా పూర్వీకుల కథలను, రహస్యాలను కాపాడుతోంది.
చెట్టు గౌరవార్థం స్టాంపు
సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు అది. లిథువేనియాలోని స్టెల్ముజ్ గ్రామంలో ఉంది. కాండం మధ్యభాగం కుళ్లిపోయి, ఖాళీగా ఉంటుంది. అయినా కూడా చెట్టు చెక్కుచెదరకుండా ఉంది. 1812లో ఒక ఫ్రెంచ్ సైనికుడు ఈ చెట్టు వద్ద మరణించాడని అంటారు. చెట్టు లోపల ఒక అస్థిపంజరం, తుపాకీ లభించడంతో అది నిజమై ఉంటుందని చెబుతారు. స్థానికుల కథనం ప్రకారం చెట్టు కాండం మధ్యలో ఉన్న తొర్ర పాతాళలోకానికి వెళ్లే ద్వారమని పూర్వీకులు నమ్మేవారట. ఆత్మలు ఈ మార్గం గుండా సంచరిస్తాయని విశ్వసించేవారట. చెట్టు పక్కనే 17వ శతాబ్దంలో నిర్మించిన సెయింట్ ఆన్ చర్చి ఉంది. ప్రభుత్వం ఈ ఓక్ వృక్షం గౌరవార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. ఈ మహావృక్ష వారసత్వం కొనసాగించేందుకు దీని గింజలను దేశవ్యాప్తంగా నాటుతున్నారు.
‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ద ఇయర్’ పేరుతో ఎన్విరాన్‌మెంటల్ పార్ట్‌నర్‌షిప్ అసోసియేషన్ (ఈపీఏ) ప్రతీ ఏటా పోటీలు నిర్వహిస్తుంది. యూరోపియన్ దేశాలు చారిత్రక నేపథ్యం ఉన్న చెట్లను తమ దేశం తరపున పోటీలో నిలుపుతాయి. ప్రజలు ఓటు వేయడం ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News