Share News

పాదరక్షల చెట్టు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:43 AM

అదొక నిర్మానుష్యమైన రహదారి. చుట్టూ ఇసుక తిన్నెలు. అక్కడ మనుషుల అలికిడి కన్నా గాలి హోరే ఎక్కువ. అలాంటి చోట ఒక చెట్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

పాదరక్షల చెట్టు

అదొక నిర్మానుష్యమైన రహదారి. చుట్టూ ఇసుక తిన్నెలు. అక్కడ మనుషుల అలికిడి కన్నా గాలి హోరే ఎక్కువ. అలాంటి చోట ఒక చెట్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే నెవాడాలోని ప్రసిద్ధ ‘షూ ట్రీ’. ఆ చెట్టు కొమ్మలకు వందల సంఖ్యలో పాత బూట్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఎందుకలా...

కొన్ని దశాబ్దాల క్రితం... కొత్తగా పెళ్లయిన ఒక జంట ఆ దారిలో ప్రయాణిస్తోంది. అనుకోకుండా వారి మధ్య మొదలైన ఒక చిన్నపాటి మాట పట్టింపు... క్షణాల్లోనే చినికి చినికి గాలివానలా మారి, పెద్ద గొడవకు దారితీసింది. ఆవేశం నషాలానికి అంటిన భార్య ‘‘నేను నీతో ఉండలేను.. ఇప్పుడే దిగి వెళ్లిపోతా’’ అంటూ కారు ఆపమని, కిందకు దిగిపోయిందట.

‘‘సరే వెళ్లాలనుకుంటే వెళ్లు.. కానీ ఈ ఎడారిలో చెప్పులు లేకుండా ఎలా నడుస్తావో చూస్తా...’’ అని కోపంతో రంకెలేస్తూ... ఆమె కాళ్లకున్న షూ లాక్కుని, బలంగా పక్కనే ఉన్న చెట్టు కొమ్మలపైకి విసిరేశాడా భర్త.


ఆమె బిత్తరపోయి చూస్తుండగానే, కారు స్టార్ట్‌ చేసి సమీపంలో ఉన్న బార్‌కు వెళ్లిపోయాడు. అక్కడ తారసపడిన ఓ పెద్దాయన... అతడి ముఖంలోని ఆందోళనను గమనించి, ఏం జరిగిందో అడిగి తెలుసుకుని... నెమ్మదిగా హితబోధ చేశాడు. ఆ మాటలు అతని మనసులోని కోపాన్ని కడిగేసి, పశ్చాత్తాపాన్ని నింపాయి. కనువిప్పు కలిగిన భర్త వేగంగా ఆ చెట్టు దగ్గరకి వెళ్లేసరికి, అతని భార్య కన్నీళ్లతో, చెప్పులు లేక ఎక్కడికీ వెళ్లలేక ఆ చెట్టు కింద అలాగే ముడుచుకుని కూర్చుని ఉంది. ఆ క్షణం ఒకరినొకరు చూసుకోగానే అపార్థాలన్నీ ఆవిరైపోయాయి. ఇద్దరూ ఆ చెట్టు సాక్షిగా రాజీపడ్డారు. ఆ జ్ఞాపకానికి గుర్తుగా, ప్రతి ఏటా తమ పెళ్లిరోజున ఆ చెట్టు దగ్గరకు వెళ్లి, తమ ప్రేమకు గుర్తుగా ఒక జత చెప్పులను ఆ కొమ్మలపైకి విసిరేవారట. కాలక్రమేణా అటుగా వెళ్లే పర్యాటకులు కూడా ఆ వింతను చూసి, పాత బూట్లను అక్కడ విసరడం మొదలెట్టారు.


వారి నమ్మకం...

భార్యాభర్తలు గొడవపడినా, చివరికి ఆ చెట్టు దగ్గరే కలిశారు కాబట్టి... ఆ చెట్టుపైకి చెప్పులు విసిరితే ‘విడిపోయిన వారు కలుస్తారు’ లేదా ‘ప్రేమ దక్కుతుంది’ అని జంటలు బలంగా నమ్ముతాయట. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు లేదా రిటైర్‌ అయినవారు, తమ పాత జీవితానికి గుర్తుగా పాత బూట్లను అక్కడ వదిలేసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అలాగే చాలామంది తమ మనసులో ఏదైనా కోరిక కోరుకుని, షూ లేసులను ముడివేసి చెట్టుపైకి విసురుతారు. అవి కింద పడకుండా కొమ్మకు తగులుకుంటే, కోరుకున్న కోరిక కచ్చితంగా తీరుతుందని నమ్ముతారు. అక్కడ హైహీల్స్‌, స్నీకర్స్‌, స్కీ బూట్స్‌, ఫ్లిప్పర్లు, చిన్న పిల్లల బూట్లు కూడా వేలాడుతూ కనిపిస్తాయి.


book7.2.jpgఅయితే, దురదృష్టవశాత్తు, 2010లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ‘షూ ట్రీ’ని నరికివేశారు. ఆ సంఘటన నెవాడా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. కానీ, ఆ సంప్రదాయం మాత్రం ఆగిపోలేదు. స్థానికులు వెంటనే పక్కనే ఉన్న మరో చెట్టును కొత్త ‘షూ ట్రీ’ గా మార్చారు. నేటికీ వేలాది చెప్పులతో కనిపించే ‘ షూ ట్రీ’ అసంఖ్యాక ప్రయాణాలకు, లక్షలాది మధుర జ్ఞాపకాలకు మౌనసాక్షిగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2026 | 11:43 AM