Share News

ఫ్లైట్‌లో మహిళ మృతి! ఎమర్జెన్సీ కాదని చెప్పి, 13.5 గంటల పాటు..

ABN , Publish Date - Mar 22 , 2026 | 10:43 AM

ప్యాసింజర్ మృతదేహంతో విమానం 13.5 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరిన ఉదంతం బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో తాజాగా వెలుగు చూసింది. హాంకాంగ్ నుంచి లండన్ వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది.

ఫ్లైట్‌లో మహిళ మృతి! ఎమర్జెన్సీ కాదని చెప్పి, 13.5 గంటల పాటు..
British Airways passenger death

ఇంటర్నెట్ డెస్క్: మహిళా ప్యాసింజర్ మృతి చెందినా విమానం అత్యవసర ల్యాండింగ్ కాకుండా జర్నీని కొనసాగించిన వైనం తాజాగా వెలుగు చూసింది. హాంకాంగ్ నుంచి లండన్ బయలుదేరిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో తాజాగా ఈ ఘటన జరిగింది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎయిర్‌బస్ ఏ350 విమానం టేకాఫ్ అయిన సుమారు గంట తరువాత మహిళ మృతి చెందారు. ఆ సమయంలో మహిళ కుటుంబ సభ్యులు కూడా విమానంలోనే ఉన్నారు. అకస్మాత్తుగా మహిళ మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు విమాన సిబ్బంది కూడా షాకయిపోయారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశంపై సిబ్బంది తర్జనభర్జనలు పడ్డారు. చివరకు మృతదేహాన్ని విమానం వెనకవైపు ఉన్న చోట పెట్టారు.


మొదట హాంకాంగ్‌కు తిరిగెళ్లిపోదామని విమానంలోని కొందరు సూచించినట్టు తెలిసింది. మహిళ అప్పటికే మృతి చెందడంతో దాన్ని ఎమర్జెన్సీగా పరిగణించలేమని సిబ్బంది నిర్ణయించారట. చివరకు లండన్ వరకూ దాదాపు 13.5 గంటల పాటు విమానం అలాగే ప్రయాణించిందట. ఇక మృతదేహాన్ని పెట్టిన ప్రదేశంలో వెచ్చగా ఉండటంతో కొంతసేపటికి విమానంలో దుర్గంధం వ్యాపించినట్టు కూడా తెలిసింది. ఈ విషయమై బ్రిటీష్ ఎయిర్‌వేస్ స్పందించింది. నిబంధనల ప్రకారమే ఆ సమయంలో సిబ్బంది వ్యవహరించినట్టు తెలిపింది.

మార్గమధ్యంలో ప్రయాణికులు మరణించిన సందర్భాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం, మృతదేహాన్ని బాడీ బ్యాగ్‌లో పెట్టాలి. లేదా మెడ వరకూ దుప్పటికప్పాలి. అనంతరం, విమానంలో జనాలు తక్కువగా ఉన్న ఖాళీ సీటులో లేదా మరో ప్రాంతంలో మృతదేహాన్ని పెట్టాలి. అన్ని సీట్లల్లో ప్రయాణికులు ఉంటే పాత సీటులోనే మృతదేహాన్ని ఉంచాలి. 2013 నాటి ఒక అధ్యయనం ప్రకారం, విమానంలో తలెత్తే మెడికల్ ఎమర్జెన్సీల్లో కేవలం 0.3 శాతం సందర్భాల్లోనే మరణాలు సంభవిస్తాయి. ఇక ప్రయాణికులు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ సందర్భాల్లో పైలట్‌లు విమానాలను సమీప ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ప్రాతిపదికన దించేస్తారు.


ఈ వార్తలూ చదవండి:

లండన్‌లో ఊహించని దృశ్యం.. ఆశ్చర్యపోతున్న భారతీయులు

ఏంటీ.. ప్లంబర్ వార్షిక ఆదాయం రూ.18 లక్షలా!

Updated Date - Mar 22 , 2026 | 11:12 AM