Share News

ఏంటీ.. ప్లంబర్ వార్షిక ఆదాయం రూ.18 లక్షలా!

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:41 AM

ప్లంబింగ్ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి ఏటా రూ.18 లక్షలు సంపాదిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు.

ఏంటీ.. ప్లంబర్ వార్షిక ఆదాయం రూ.18 లక్షలా!
Mumbai plumber income

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగంలో ఏటా రూ.10 లక్షల పైచిలుకు శాలరీ రావాలంటే ఉన్నత చదువులు, అనుభవం, నైపుణ్యాలు వంటివి ఎన్నో ఉండాలి. అయితే, తన ఇంటికి వచ్చిన ప్లంబర్‌ ఏటా రూ.18 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిసి ఒక ఉన్నత విద్యావంతుడు షాకైపోయాడు. ఇందుకు సంబంధించి అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఒక ఉన్నత విద్యావంతుడు తనకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ చర్చా వేదిక రెడిట్‌లో తాజాగా పంచుకున్నాడు. తన ఇంట్లో రిపేర్ల కోసం వచ్చిన ప్లంబర్ వార్షిక ఆదాయం తెలిసి ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. అతడి లైఫ్ చూశాక తనకు తనపైనే సందేహం కలిగిందని అన్నాడు. తాను జీవితంలో ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? అనే అనుమానం కలిగిందని చెప్పాడు.


‘ఏదో కుతూహలం కొద్దీ..నీ వార్షిక ఆదాయం ఎంత అని ప్లంబర్‌ను ప్రశ్నించాను. తాను సంవత్సరానికి రూ.18 లక్షలు సంపాదిస్తున్నట్టు అతడు చెప్పాడు. మొదట నేను నమ్మలేదు. అతడిని మరిన్ని వివరాలు అడిగాక నాకు ఆశ్చర్యం వేసింది. ముంబైలోని మీరా రోడ్, బోరీవలీ, కాందీవలీ ప్రాంతాల్లో అతడు ప్లంబింగ్ పనులు చేస్తుంటాడు. అక్కడి హౌసింగ్ సొసైటీల్లో ఎక్కువగా పనులు చేస్తాడట. అతడికి 2023 మోడల్ హ్యుందాయ్ క్రెటా కారు ఉంది. సొంత ఊళ్లో ఇల్లు కట్టుకున్నాడు. పొలం కొనుగోలు చేశాడు. స్థూలంగా చెప్పాలంటే అతడు చాలా రిచ్. అతడితో మాట్లాడుతుంటే నేను ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? అనే సందేహం కలిగింది’ అని సదరు నెటిజన్ వ్యాఖ్యానించాడు.

ఇక ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నేటి జమానాలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్ చేసే వారికి చాలా డిమాండ్ ఉందని అనేక మంది కామెంట్ చేశారు. భారతీయులు వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తుంటారని కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ కూడా ఈ కాలంలో మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో బ్లూకాలర్ వర్కర్లు మరింత మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారని అన్నారు.


ఇవీ చదవండి:

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన రాఫ్టింగ్ బృందం.. వీడియో వైరల్

విరాట్ జెర్సీ కోసం చిన్నారి మంకుపట్టు.. వైరల్‌గా మారిన వీడియో..

Updated Date - Mar 19 , 2026 | 08:49 AM